రాహుల్ గాంధీయే పెద్ద అపశకునం
ఇటీవల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సమయంలో భారత టీమ్ ఓడిపోయింది.
న్యూఢిల్లీ: ఇటీవల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సమయంలో భారత టీమ్ ఓడిపోయింది. టీమిండియా ఓటమిపై రాహుల్ రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, ప్రపంచకప్ చేజారడానికి కారణం మోదీనే అంటూ, 'పనౌటీ' (అపశకునం) పదాన్ని వాడారు. దీనిపై బీజేపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కీలక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడంతో రాహుల్ గాంధీ 'పనౌటీ' అనే హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే, ఈసారి పనౌటీ మాటను రాహుల్ గాంధీకి అన్వయిస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
హిందీ మాట్లాడే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడటానికి రాహుల్ గాంధీనే బాధ్యుడిగా చేస్తూ ఈ పదం మరోసారి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. 'తుది ఫలితాలపై స్పష్టత వచ్చిన తర్వాత, మేము మూడు రాష్ట్రాల్లో భారీ మెజారిటీని పొందుతామని' బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది అన్నారు. 'మధ్యప్రదేశ్‌లో తమ విజయానికి లాడ్లీ బెహనా పథకం ఒక గేమ్ ఛేంజర్‌గా మారిందని, ఈ క్రెడిట్ శివరాజ్ సింగ్ చౌహాన్‌దేనని' కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.