Pakisthan: పాక్‌లో ప్రమాదకర స్థాయికి కాలుష్యం.. ముల్తాన్‌లో 2,135కి చేరిన ఏక్యూఐ
పాకిస్థాన్‌లో వాయు కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ఇది మరింత ప్రమాదకర స్థాయికి చేరింది.
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో వాయు కాలుష్యం (Air Pollution) రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ఇది మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. పంజాబ్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన ముల్తాన్( Multan)లో శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 2,135గా నమోదైనట్టు స్విస్ ఎయిర్ క్వాలిటీ మానిటర్ (IQ AIR) తెలిపింది. అలాగే గాలిలో పీఎం 2.5 గాఢత ఒక క్యూబిక్ మీటరుకు 947 మైక్రో గ్రాములుగా నమోదైంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) సూచించిన నిర్దేశిత ప్రమాణం కంటే 189.4 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అలాగే అదే రోజు రాత్రి సమయానికి ఏక్యూఐ 980గా ఉంది. ప్రమాదకరంగా పరిగణించబడిన 300 ఏక్యూఐ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఇక, శంసాబాద్ కాలనీ, ముల్తాన్ కాంట్ ఏరియాలో ఏక్యూఐ వరుసగా 2316, 1635,1527గా నమోదైంది.
పార్కులు, పాఠశాలలు మూసివేత
కాలుష్యం ప్రమాదకరంగా మారడంతో ఈ నెల 17 వరకు అనేక జిల్లాల్లోని పార్కులు, మ్యూజియంలు, పాఠశాలలను మూసివేయాలని పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. ట్యూషన్ సెంటర్లు, అకాడమీలను సైతం క్లోజ్ చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది. అలాగే ముల్తాన్‌లోని అతిపెద్ద ఆస్పత్రి అయిన నిష్టర్ హాస్పిటల్‌లోని ఓపీడీ, ఎమర్జెన్సీ వార్డుల్లో రెండు అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేశారు. పొగ వెదజల్లే వాహనాలు, చెత్తను కాల్చే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపింది.
లాహోర్‌లోనూ డేంజర్ ఏక్యూఐ !
పాక్‌లోని కీలక నగరమైన లాహోర్‌లోనూ కాలుష్యం ప్రమాదకరంగానే ఉంది. ఈ నగరంలో ఏక్యూఐ 784కి చేరుకుంది. దీంతో ఇటీవలే అత్యంత కాలుష్యనగరంగా రికార్డు నమోదు చేసింది. గతంలో ఈ ప్రాంతంలో ఏక్యూఐ 1,165గా నమోదైంది. ఇది - ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన స్థాయి కంటే 120 రెట్లు ఎక్కువ. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రజలు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు.