Himachal Pradesh: మనాలీని కమ్మేసిన పొగమంచు.. ట్రాఫిక్ లో చిక్కుకున్న వెయ్యి వాహనాలు
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని మనాలీ(Manali)పై మంచు కమ్మేసింది. భారీగా మంచు కురవడం వల్ల మనాలీలోని పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని మనాలీ(Manali)పై మంచు కమ్మేసింది. భారీగా మంచు కురవడం వల్ల మనాలీలోని పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోహ్‌తంగ్‌లోని సొలాంగ్, అటల్ టన్నెల్(Atal Tunnel)ల మధ్య భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వెహికిల్స్ చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్(rescue operations) నిర్వహించారు. 700 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు 700 మంది టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు పంపించారు. ప్రస్తుతం అటల్ టన్నెల్ మార్గంలో వాహనాల రాకపోకలు స్లోగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారీగా ట్రాఫిక్
అయితే, గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తుండటంతో మనాలీకి టూరిస్టులు పోటెత్తారు. సోమవారం సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. దట్టమైన మంచు కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో వెహికిల్స్ ముందుకు వెళ్లలేక భారీగా ట్రాఫిక్ అయ్యింది. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అలాగే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాలోనూ భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం వల్ల రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా బంద్ చేశారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం నేపథ్యంలో ఏటా డిసెంబర్ చివరి వారంలో మనాలీకి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.