మధ్యప్రదేశ్‌లో డిపాజిట్ కోల్పోయిన 311 మంది అభ్యర్థులు

84 శాతం మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాలను కోల్పోయారు

Update: 2024-06-07 13:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు ఒక్కోచోట ఒక్కో అనూహ్య ఫలితాన్ని అందించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాన్రెస్ కంచుకోటగా పేరున్న చింద్వారాతో సహా రాష్ట్రంలోని 29 స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలకు మించి ఆశ్చర్యకరమైన పరిణామం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అన్ని స్థానాల్లో పోటీ చేసిన మొత్తం 369 మంది అభ్యర్థుల్లో 311 మంది కనీసం డిపాజిట్లను కూడా సాధించలేకపోయారని అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. దీంతో 84 శాతం మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాలను కోల్పోయారు. వారు ఎన్నికల్లో పోటీ కోసం ఒక్కొక్కరు రూ. 12,500 నుంచి రూ. 25,000 వరకు ఉంటుందని సమాచారం. మొత్తం 29 సీట్లలో బీజేపీ 40 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో విజయాన్ని దక్కించుకుంది. 26 నియోజకవర్గాల్లో లక్షల నుంచి 5 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ గెలుపు సాధించింది. భిద్, గ్వాలియర్, మొరెనా సీట్లలో మాత్రమే లక్ష లోపు ఓట్లు వచ్చాయి. 2019 నాటి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 59.3 శాతం ఓట్లు సాధించగా, ఈసారి అదనంగా 1.3 శాతం ఓట్లు పెరిగాయి. మొత్తం 369 మంది అభ్యర్థుల్లో యాభై ఎనిమిది మంది, బీజేపీకి చెందిన 29 మంది, కాంగ్రెస్‌కు చెందిన 27 మంది, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)కి చెందిన ఇద్దరు అభ్యర్థులు డిపాజిట్లను కాపాడుకున్నారని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనుపమ్ రాజ్ఞ్ చెప్పారు. ఈ సారి కాంగ్రెస్ ఓట్ల శాతం 2.1 శాతం తగ్గినా, ఆ పార్టీ అభ్యర్థులెవరూ డిపాజిట్ కోల్పోలేదు. 2019లో 34.5 శాతం నుంచి 32.4 శాతానికి కాంగ్రెస్ తన ఓట్లను కోల్పోయింది. 


Similar News