సనాతన ధర్మాన్ని అంతం చేసేందుకు ‘ఇండియా’ కుట్ర : ప్రధాని మోదీ
ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని అనుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు.
భోపాల్ : ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని అనుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహంగా కనిపిస్తోందన్నారు. వేల ఏళ్లపాటు దేశాన్ని ఏకం చేసిన భారతీయుల విశ్వాసాలు, సంప్రదాయాలపై దాడి చేయాలనే నిర్ణయానికి ఇండియా కూటమిలోని పార్టీలు వచ్చాయన్నారు. లోకమాన్య తిలక్, స్వామి వివేకానంద వంటివారికి స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని అంతం చేసేందుకు కొన్ని పార్టీలు కుట్రపన్నాయని విమర్శించారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని బినాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఇండియా కూటమిని ఘమండియా (దురహంకారి) కూటమిగా ఆయన అభివర్ణించారు.
జీ20 శిఖరాగ్ర సదస్సు విజయం అనేది 140 కోట్ల మంది భారతీయులకు చెందుతుందన్నారు. ఇది మనదేశ సామూహిక శక్తికి నిదర్శనమని కొనియాడారు. భారతదేశంలోని భిన్నత్వం, సాంస్కృతిక సంపదను చూసి జీ20 నేతలు అబ్బురపడ్డారని చెప్పారు. ‘‘మధ్యప్రదేశ్‌లో రూ.50 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. ఈ మొత్తం నిధులు కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ’’ అని మోడీ పేర్కొన్నారు.