బీజేపీని మ్యాజిక్ మార్కుకు దూరం చేసిన 6 లక్షల ఓట్లు

బీజేపీ 240 సీట్లలో విజయం సాధించడంతో సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని కాషాయ పార్టీ కోల్పోయింది.

Update: 2024-06-06 13:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వరుసగా మూడవసారి జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 293 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అంటే మెజారిటీ మార్కు 272 సీట్లకు 21 ఎక్కువ. కానీ, జేపీ నడ్డా నేతృత్వంలో బీజేపీ 240 సీట్లలో విజయం సాధించడంతో సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని కాషాయ పార్టీ కోల్పోయింది. ఎన్నికల ఫలితాల అనంతరం జరిపిన అధ్యయనంలో.. కేవలం 6 లక్షల కంటే తక్కువ ఓట్ల కారణంగా బీజేపీ సొంతంగా 272 సీట్లను గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల కంటే దాదాపు 69 లక్షల ఎక్కువ ఓట్లను సాధించింది. మొన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం 23.59 కోట్ల(36.6 శాతం షేర్) ఓట్లను బీజేపీ పొందగా, ఐదేళ్ల క్రితం 22.9 కోట్ల(37.3 శాతం) ఓట్ల నమోదయ్యాయి. అంటే గత లోక్‌సభ ఎన్నికల కంటే 68,97,056 ఓట్లు అధికంగా వచ్చినప్పటికీ ఓట్ల శాతంలో 0.76 శాతం తేడాతో లోక్‌సభలో బీజేపీకి 63 సీట్లు తగ్గాయి. బీజేపీ అభ్యర్థులు ఈ ఆరు లక్షల ఓట్లను సాధించి ఉంటే ఆ పార్టీ సొంతంగానే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది.

బీజేపీ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 32 చోట్ల చాలా తక్కువ తేడాతో విజయానికి దూరమైంది. ఉదాహరణకు, చండీగఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ కేవలం 2,509 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అలాగే, హమీర్‌పూర్(యూపీ, 2,629 ఓట్లు వెనుకంజ), సేలంపూర్(యూపీ, 3,573 మార్జిన్), ధూలే(మహారాష్ట్ర, 3,831 ఓట్లు), ధౌరాహ్రా(యూపీ, 4,449), డమన్ అండ్ డయూ(డమన్ అండ్ డయూ, 6225), ఆరంబాగ్(పశ్చిమ బెంగా, 6,399), బీడ్(మహారాష్ట్ర, 6,553) సీట్లలో అత్య్ల్ప ఓట్ల తేడాదతో సొంత మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ కోల్పోయింది. గరిష్ఠ మార్జిన్‌లలో లూథియానా(పంజాబ్, 20,942), భేరీ(యూపీ, 34,329) వరకు ఉన్నాయి. బీజేపీ మునుపటి 168 మంది ఎంపీల్ల్లో 111 మందిని గెలిపించుకుంది. మరోవైపు, 132 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు ఓడిపోయారు. 95 సిట్టింగ్ స్థానాల్లో విజయం దక్కించుకుంది. బీజేపీ మొత్తం 441 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను బరిలో నిలబెట్టింది. 


Similar News