సీజేఐపై ఆన్‌లైన్ ట్రోలింగ్.. రాష్ట్రపతికి లేఖ
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌పై జరుగుతున్న ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను విపక్షాలు వ్యతిరేకించాయి.
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌పై జరుగుతున్న ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను విపక్షాలు వ్యతిరేకించాయి. ఈ విషయంలో జోక్యం చేసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని 13 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతికి లేఖ రాశాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, గవర్నర్ పాత్ర విషయంలో ఒక ముఖ్యమైన రాజ్యాంగ సమస్యను సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుందని లేఖలో పేర్కొన్నారు.
‘మహారాష్ట్రలోని అధికార పార్టీ ప్రయోజనాలకు సానుభూతి చూపే ట్రోల్ ఆర్మీ సీజేఐపై మాటల దాడి ప్రారంభించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సీజేఐని వ్యతిరేకిస్తూ పోస్టులు వైరల్‌గా మారాయి. కోర్టులో వ్యవహారంలో ఉన్న సమయంలో ఈ తరహా ట్రోలింగ్ సరైంది కాదు’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీలు దిగ్విజయ్ సింగ్, శక్తి సిన్హ్ గోహిల్, ప్రమోద్ తివారీ, అమే యాగ్నిక్, రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు లేఖపై సంతకాలు చేశారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ మాట్లాడుతూ, ఇలాంటి ట్రోల్స్‌లను కేంద్ర సంస్థలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. రాష్ట్రపతి లేఖ రాసిన వారిలో కాంగ్రెస్ ఎంపీలు, ఆప్ ఎంపీలు, థాక్రే వర్గం ఎంపీలు, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు ఉన్నారు.