అలా అయితే నేనే మొదటగా రాజీనామా చేస్తా: సీఎం
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ)కి దరఖాస్తు చేసుకోని ఒక్క వ్యక్తికి అయినా పౌరసత్వం లభించినా తానే మొదటగా రాజీనామా చేస్తానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం అన్నారు
దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ)కి దరఖాస్తు చేసుకోని ఒక్క వ్యక్తికి అయినా పౌరసత్వం లభించినా తానే మొదటగా రాజీనామా చేస్తానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం అన్నారు. శివసాగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నేను అస్సాం బిడ్డను, CAA అమలు తర్వాత లక్షలాది మంది రాష్ట్రంలోకి ప్రవేశిస్తారని నిరసనకారులు అంటున్నారు. ఇది జరిగితే మొదటగా నిరసన వ్యక్తం చేసే వారిలో నేనే ముందుంటానని అన్నారు.
CAA గురించి కొత్తగా ఏమీ లేదు, ఇప్పుడు పోర్టల్‌లో దరఖాస్తు చేయడానికి సమయం ఆసన్నమైంది. ఇందులోని డేటా ఇప్పుడు మొత్తం వివరాలను అందిస్తుంది. ఈ చట్టాన్ని వ్యతిరేకించే వారి వాదనలు వాస్తవంగా సరైనవా కాదా అనేది స్పష్టంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA) ను సోమవారం అమలు చేయడంతో ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలు, నిరసనల నేపధ్యంలో అస్సాం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ నిబంధనలను జారీ చేయడంతో, డిసెంబర్ 31, 2014కి ముందు భారత్‌కు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభించనుంది.