త్వరలో కేబినెట్ ముందుకు 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'పై ఉన్నతస్థాయి కమిటీ నివేదిక

ఈ అంశంపై న్యాయశాఖ సైతం త్వరలో తమ నివేదికను అందజేయనుంది.

Update: 2024-06-14 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 100 రోజుల ఎజెండాలో భాగంగా 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అంశంపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికను త్వరలో కేబినెట్ ముందు ఉంచాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మూడో టర్మ్‌లో తొలి 100 రోజుల్లో చేపట్టే కార్యక్రమాల ప్రణాళికను రూపొందించాలని అన్ని శాఖలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే న్యాయశాఖ అందుకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై న్యాయశాఖ సైతం త్వరలో తమ నివేదికను అందజేయనుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించింది. లోక్‌సభతో పాటూ దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం, ఆ తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను చేపట్టాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. అంతేకాకుండా ఈ మూడు ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా, కార్డులను రూపొందించాలని సూచించింది. ఈ ఎన్నికలను 2029 నుంచి అమలు చేయాలని, ఒకవేళ హంగ్ ఏర్పడటం, అవిశ్వాసం సమయంలో ఏకీకృత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లా కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  


Similar News