జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గె
దేశంలో పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఈ ఆలోచన సరికాదన్నారు. ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయాలని కోరారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే 'అప్రజాస్వామిక' ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక ' అనేది సమాఖ్య హామీలకు, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని అభిప్రాయపడింది. జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్‌నాథ్ కొవింద్ కమిటీకి లేఖ రాసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె, దేశంలో పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఈ ఆలోచన సరికాదన్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు కమిటీ ఛైర్మన్‌గా ఉన్న రామ్‌నాథ్ కొవింద్‌ను ప్రస్తావిస్తూ, ' పార్టీ, దేశ ప్రజల తరపున అభ్యర్థిస్తూ.. తమ వ్యక్తిత్వాన్ని, భారత మాజీ రాష్ట్రపతి కార్యాలయాన్ని దుర్వినియోగం చేసేందుకు అనుమతించవద్దు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కింది' అంటూ ఖర్గె పేర్కొన్నారు. ఒకేసారి ఎన్నికల వంటి అప్రజాస్వామిక ఆలోచనలతో ప్రజల దృష్టిని మళ్లించకుండా, వారి ఆదేశాలను గౌరవించే ప్రభుత్వం, పార్లమెంట్, ఎన్నికల సంఘం పనిచేయాలన్నారు.
కాంగ్రెస్‌తో పాటు బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక 'పై గతేడాది సెప్టెంబర్‌లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ నేతృత్వంలో కేంద్రం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల పలు జాతీయ, ముప్పైకి పైగా ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలను కోరింది. అలాగే, న్యాయ కమిషన్ నుంచి సైతం సలహాలు తీసుకుంటోంది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది.