NTA: ఇకపై ఎన్టీఏ రిక్రూట్ మెంట్ పరీక్షలు నిర్వహించదు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన
రిక్రూట్ మెంట్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విషయాల్లో కేంద్రం కీలక మార్పులు తీసుకురానుంది. వీటి నిర్వహణ అంశంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ప్యానెల్ దృష్టి సారించింది.
దిశ, నేషనల్ బ్యూరో: రిక్రూట్ మెంట్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విషయాల్లో కేంద్రం కీలక మార్పులు తీసుకురానుంది. వీటి నిర్వహణ అంశంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ప్యానెల్ దృష్టి సారించింది. దీంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) బాధ్యతల్లో మార్పులు జరగనున్నాయి. ఇకపై రిక్రూట్మెంట్ పరీక్షలను ఆ సంస్థ నిర్వహించదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెల్లడించారు. ‘‘ఉన్నత స్థాయి ప్యానెల్ సిఫార్సు చేసిన సంస్కరణల్లో భాగంగానే ఈ మార్పులు చేశాం. ఇకపై రిక్రూట్మెంట్ పరీక్షలను ఎన్టీఏ నిర్వహించదు. కేవలం ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుంది. ఇది 2025 నుంచి అమలుకానుంది. ఎన్టీఏను ప్రక్షాళన చేస్తాం. వచ్చే ఏడాది దీనిలో మరిన్ని మార్పులు రానున్నాయి. కొత్తగా పది పోస్టులు సృష్టిస్తాం. జీరో- ఎర్రర్ టెస్టింగ్ ఉండేలా ఎన్టీఏ పనితీరులో మార్పులు ఉంటాయి’’ అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి ఏమన్నారంటే?
‘‘కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET- UG) ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించనున్నాం. అంతేకాకుండా.. నీట్ యూజీ పరీక్షలు పెన్-పేపర్ విధానంలో నిర్వహించాలా..? లేదా ఆన్లైన్లో చేపట్టాలా అనే విషయంపై ఆరోగ్య మంత్రిత్వశాఖతో చర్చలు జరుగుతున్నాయి. అయితే.. భవిష్యత్తులో అన్ని ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది’’ అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కాగా.. నీట్ పేపర్ లీక్, ఇతర పరీక్ష నిర్వహణల్లో అవకతవకలు జరుగుతున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాలతో విద్యాశాఖ ఉన్నతస్థాయి ప్యానెల్ సంస్కరణలకు ఉపక్రమించింది. ప్రవేశ పరీక్ష, రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహణల్లో సంస్కరణలు చేసింది. ఈ సిఫార్సుల ప్రకారం.. కొత్తగా ఈ మార్పులు జరుగుతున్నాయి.