ప్రతి జీఎస్టీ కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు
విశ్వసనీయమైన సాక్ష్యాలు, నేరాన్ని రుజువు చేసేందుకు కావాల్సిన స్పష్టమైన మెటీరియల్ ఉంటేనే అరెస్ట్ చేయవచ్చని పేర్కొంది.
దిశ, నేషనల్ బ్యూరో: అన్ని వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కేసుల్లో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని భారత అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి తెలిపింది. విశ్వసనీయమైన సాక్ష్యాలు, నేరాన్ని రుజువు చేసేందుకు కావాల్సిన స్పష్టమైన మెటీరియల్ ఉంటేనే అరెస్ట్ చేయవచ్చని పేర్కొంది. కస్టమ్స్ చట్టం, వస్తు, సేవల పన్ను చట్టానికి సంబంధించిన నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటు, వివరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేల త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి సూచనలిచ్చింది. అరెస్ట్ చేయడం కంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ముఖ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విచారణ పూర్తి చేయడానికి అరెస్ట్ చేయాలని చట్టం చెప్పలేదు. ఇది చట్టం ఉద్దేశం కాదు. జీఎస్టీకి సంబంధించిన ప్రతి కేసులో అరెస్ట్ చేయనవసరం లేదు. కొంత విశ్వసనీయత ఆధారంగా ఉండాలి. సాక్ష్యాలు, స్పష్టమైన అంశాలు ఉండాలని' ధర్మాసనం పేర్కొంది. చట్టం స్వేచ్ఛను ఉన్నత పీఠంపై ఉంచిందని, దాన్ని పలుచన చేయవద్దని వెల్లడించింది.