బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన North Korea .. వ్యతిరేకించిన South Korea
ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని ఆదివారం దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర ప్యాంగ్యాన్ ప్రావిన్స్‌లోని టైకాన్ అనే ప్రాంతంలో ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. ఇది ఒక స్వల్ఫ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. ఈ క్షిపణి 60 కిలో మీటర్ల ఎత్తులో ప్రయాణించి.. దాదాపు 600 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాన్ని ఛేదించగలదు. అయితే మరికొద్ది రోజుల్లో దక్షిణ కొరియా-అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసం నిర్వహించనుంది. దీనికి సంబంధించిన అణుశక్తి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రోనాల్డ్ రీగన్ బుసాన్ పోర్టుకు చేరుకుంది.
ఈ క్రమంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష నిర్వహించడంతో ఆందోళన పెరిగింది. అలాగే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దక్షిణ కొరియాను సందర్శించనున్నారు. ఈ క్రమంలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం కవ్వింపు చర్యగా దక్షిణ కొరియా భావిస్తోంది. దీనికి సమాధానంగా తమ సైన్యం కూడా సంసిద్ధంగా ఉందని దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. అమెరికాతో కలిసి రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని దక్షిణ కొరియా పేర్కొంది. కాగా, 2006-2017 వరకు ఉత్తరకొరియా మొత్తంగా ఆరుసార్లు అణు పరీక్షలు నిర్వహించింది.