మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటనపై కర్ణాటక హైకోర్టు సీరియస్

Update: 2023-12-14 13:33 GMT

బెంగళూరు : ‘‘మహాభారత కాలంలో ద్రౌపదికి సాయం చేయడానికి శ్రీకృష్ణుడు పరుగుపరుగున వెళ్లాడు.. దురదృష్టవశాత్తు ఇది దుర్యోధనులు, దుశ్శాసనుల ప్రపంచం! ఇప్పుడు నిరుపేద ద్రౌపదిని ఆదుకోవడానికి ముందుకొచ్చే శ్రీకృష్ణులు ఎవ్వరూ లేరు’’ అని కర్ణాటక హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. డిసెంబరు 11న (సోమవారం) కర్ణాటకలోని బెల్గావి గ్రామంలో 42 ఏళ్ల మహిళను నగ్నంగా చేసి స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆ మహిళ కుమారుడు, తాను ప్రేమించిన ఓ యువతితో కలిసి ఊరి నుంచి పారిపోయాడు. అనంతరం యువతి తరఫు కుటుంబీకులు దాదాపు పది మంది వచ్చి మహిళను వివస్త్రగా చేసి భౌతికదాడి చేశారు. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి, గురువారం విచారణ నిర్వహించింది. ‘‘డిసెంబరు 11న అర్ధరాత్రి ఒంటిగంటకు ఇంటి నుంచి మహిళను లాక్కెళ్లి దాడి చేశారు. ఇది జరిగిన రెండున్నర గంటల తర్వాత (తెల్లవారుజామున 3.30 గంటలకు) పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. సకాలంలో వెళ్లి ఉంటే ఈ ఘోర అవమానం నుంచి మహిళను పోలీసులు రక్షించగలిగేవారు’’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.బి. వరాలే, న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.

‘‘చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. దాదాపు పది మంది పురుషులు.. రెండు గంటలపాటు ఆ మహిళ పట్ల జంతువుల్లా వ్యవహరించారు. మనుషులు ప్రవర్తించే తీరు ఇదేనా?’’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘‘బాధిత మహిళకు మానసిక కౌన్సెలింగ్ ఇచ్చారా? లేదా? ఆమెకు అయిన గాయాలు, అందించిన చికిత్స వివరాలు ఏమిటి? అనేవి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టులో లేవు’’ అని చెప్పారు. ఆ వివరాలన్నీ సమర్పించేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ శశి కిరణ్ శెట్టి కోర్టును కోరారు. తదుపరి విచారణలో అప్‌డేటెడ్ స్టేటస్ రిపోర్టు తీసుకొని ఏసీపీతో పాటు కమిషనర్ ఆఫ్ పోలీస్ బెల్గావి హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.


Similar News