వాహనదారులకు BIG అలర్ట్.. కిక్కిరిసిన పెట్రోల్ బంకులు!

దేశవ్యాప్తంగా వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి.

Update: 2024-01-02 10:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రష్ పెరిగిపోయింది. పలు చోట్ల స్టాక్ లేదంటూ పలు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు బోర్డులు తగిలించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా దేశమంతటా మంగళవారం పెట్రోల్ పంపుల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. అయితే ఈఅసాధారణ పరిస్థితిని చూసి అసలేం జరిగిందో అర్థం కాక చాలా మంది వాహనదారులు అయోమయానికి గురయ్యారు.

ఒక్కసారిగా పోటెత్తిన వాహనదారులు:

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో నింబంధనలను కఠినతరం చేసింది. అయితే ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు సమ్మెబాట పట్టారు. దీంతో వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంక్ లకు పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మిర్, లద్దాఖ్ లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

నగరాల్లో ఉద్యోగులు బైకులు, కార్లలో ఇంధనం నింపుకునేందుకు బారులు తీరగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాల నిమిత్తం డీజిల్ కోసం బంక్ లకు పోటెత్తుతున్నారు. చివరకు పాలిథీన్ కవర్లో కూడా ఇంధనాన్ని తీసుకెళ్తున్న ఘటనలు కనిపించాయి. చోట్ల బంకుల ముందు వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Tags:    

Similar News