Uddhav Thackeray : రాజీవ్‌గాంధీని మా నాన్న విమర్శించినా దర్యాప్తు సంస్థలు రాలేదు : ఉద్ధవ్ థాక్రే

దిశ, నేషనల్ బ్యూరో : శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన తండ్రి బాల్‌థాక్రేను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-21 17:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో : శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన తండ్రి బాల్‌థాక్రేను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్న (బాల్ థాక్రే) నాటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీపై ఎన్నోసార్లు తీవ్ర విమర్శలు చేశారు. అయినా ఎన్నడూ సీబీఐ, ఈడీ లేదా ఆదాయపు పన్ను శాఖ మా ఇంటి తలుపు తట్టలేదు. మా పార్టీ నేతలపైనా రైడ్స్ జరగలేదు’’ అని ఉద్ధవ్ థాక్రే గుర్తు చేసుకున్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన సద్భావనా దివస్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, శివసేన రాజకీయంగా బద్ధ విరోధులైనా.. ఎన్నడూ తమ పార్టీలు పరస్పర ప్రతీకార ధోరణితో వ్యవహరించలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడినందుకు ఉద్ధవ్ థాక్రే‌పై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా విరుచుకుపడ్డారు. ‘‘ఉద్ధవ్ థాక్రేజీ కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఉద్ధవ్ సేనను కాంగ్రెస్‌లో కలిపేశారా ?’’ అని ఆయన ప్రశ్నించారు.

‘‘హిందుత్వాన్ని, సావర్కర్‌ను తిట్టిపోసే వాళ్ల మెడ పట్టీని ఉద్ధవ్ జీ వేసుకున్నారు’’ అని విమర్శించారు. బీజేపీ నుంచి ఇలాంటి విమర్శలు వస్తాయని ముందే ఊహించిన ఉద్ధవ్ థాక్రే సద్భావనా దివస్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను గౌరవించేందుకే తాను ఆ పార్టీ కండువా వేసుకున్నట్లు తెలిపారు. ‘‘1984లో లోక్‌సభలో 400కుపైగా సీట్లు ఉన్నా దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్‌గాంధీ చర్యలు చేపట్టారు. అధికారాల వికేంద్రీకరణకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు’’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ ఖర్చులతో వైద్య చికిత్స కోసం అటల్ బిహార్ వాజ్‌పేయిని అమెరికాకు పంపిన ఘనత రాజీవ్‌గాంధీ‌కే దకకుతుంది. 400 పార్ నినాదం చేయకున్నా రాజీవ్ గాంధీ ఈ సాయం చేసి పెట్టారు’’ అని తెలిపారు. ‘‘మణిపూర్, కశ్మీర్ మండుతున్నా ఇప్పటి ప్రధాని నోరు విప్పరు. కానీ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు రాజీవ్‌గాంధీ రాజీపడలేదు. ధైర్యంగా ముందుకుసాగారు’’ అని ఉద్ధవ్ థాక్రే చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News