దేశంలో రామరాజ్యాన్ని ఎవరూ ఆపలేరు: రాజ్‌నాథ్ సింగ్
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బీహార్‌లో అరుణ్ భారతికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, భారతదేశంలో రామరాజ్యాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బీహార్‌లో అరుణ్ భారతికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, భారతదేశంలో రామరాజ్యాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని తెలిపారు. అలాగే, లాలూ ప్రసాద్ యాదవ్ నా స్నేహితుడు.. ఆయన కుటుంబ సభ్యులు తాము అధికారంలోకి వస్తే, మోడీ, బీజేపీ నేతలను జైలుకు పంపుతామని అంటున్నారు. జైల్లో ఇంకా బెయిల్‌పై ఉన్నవారు మోడీని జైలుకు పంపిస్తారా? బీహార్ ప్రజలు అన్నింటినీ సహిస్తారు, కానీ ఇది కాదు అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అంతకుముందు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎన్నికల బాండ్ల స్కామ్‌లో మోదీ, బీజేపీ నేతలు జైలుకు వెళతారని మీసా భారతి పేర్కొనగా తాజాగా ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. ర్యాలీలో మాట్లాడిన ఆయన మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చెప్పారు. వీటిలో జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం, రామ మందిర నిర్మాణం వంటివి ఉన్నాయి. రామ్ లల్లా తన గుడిసెను వదిలి తన రాజభవనంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు భారతదేశంలో రామరాజ్యాన్ని ఎవరూ ఆపలేరు అని ఆయన అన్నారు.