Sharad Pawar: సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) ముందు రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.

Update: 2024-09-04 10:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) ముందు రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్(Sharadchandra Pawar) కీలక వ్యాఖ్యలు చేయారు. మహా వికాస్ అఘాడి (MVA) తరుఫు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదని సంచలన కామెంట్లు చేశారు. కొల్హాపూర్(Kolhapur) లో మీడియాతో మాట్లాడిన ఆయన అక్టోబర్- నవంబర్ లో జరిగే ఎన్నికల గురించి మాట్లాడారు. కూటమి సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకోవచ్చన్నారు. కూటమిలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందో దాని ఆధారంగా అభ్యర్థిని నిర్ణయిస్తారని వెల్లడించారు.

డైలమాలో కాంగ్రెస్..

అయితే విపక్ష కూటమికి సీఎం అభ్యర్థిగా శివసేన (యూబీటీ)కి నేతృత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేను(Uddhav Thackeray) ఖరారు చేస్తారని వస్తున్న తరుణంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే, రానున్న ఎన్నికల్లో మహావికాస్‌ అఘాడి కూటమికి సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చడంలో కాంగ్రెస్‌ సైతం డైలమాలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని శివసేన (యూబీటీ) ఒత్తిడి చేస్తుంది. అలానే, ఉద్ధవ్‌ను సంకీర్ణ ప్రచార సారథిగా చేయాలని కాంగ్రెస్ యోచిస్తుందనే వార్తలు మహా పొలిటికల్‌ సర్కిల్స్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాగా.. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి.


Similar News