'ట్రిపుల్ తలాక్ రద్దుతో ఏ ముస్లిం మహిళా సంతోషంగా లేదు': యువ ఎంపీ ఇక్రా చౌదరి

స్థానిక సమస్యలు ఉన్నప్పటికీ బీజేపీ హిందూ-ముస్లిం ఎజెండాను మాత్రమే ఎన్నికల్లో ప్రచారం చేసిందని ఆరోపణలు చేశారు.

Update: 2024-06-10 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌ సరికొత్త ప్రయోగం చేసి విజయం సాధించారు. పలు కీలక నియోజకవర్గాల్లో ఎస్పీ అధినేత యువతను రంగంలోకి దించారు. అలా యూపీలోని కైరానా స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా 29 ఏళ్ల ఇక్రా చౌదరీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రదీప్ కుమార్‌పై 69 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. లోక్‌సభలోని పిన్న వయసు ఎంపీల్లో ఆమె కూడా ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. యూపీలో సైతం డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏమీ చేయలేదు. ప్రధానంగా రైతుల సమస్యలు, చెరకు సంబంధిత సవాళ్లు వంటి స్థానిక సమస్యలు ఉన్నప్పటికీ బీజేపీ హిందూ-ముస్లిం ఎజెండాను మాత్రమే ఎన్నికల్లో ప్రచారం చేసిందని ఆరోపణలు చేశారు. పార్లమెంట్‌లో ముస్లింల ప్రాతినిధ్య తగ్గడంపై స్పందించిన ఇక్రా చౌదరీ..నేను ముస్లిం ఎంపీనే కానీ నా నియోజకవర్గంలో ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత నాపై ఉంది. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతాను. ఇదే సమయంలో ముస్లిం వర్గానికి అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా గళం విప్పుతానని ఆమె అన్నారు. 18వ లోక్‌సభలో 24 మంది ముస్లిం ఎంపీలు ఉన్నారు.

త్రిపుల్ తలాక్ రద్దు వల్ల ముస్లిం మహిళల నుంచి తమకు మద్దతు పెరిగిందని బీజేపీ చెబుతున్న అంశంపై స్పందించిన ఆమె.. అందులో వాస్తవం లేదు. బీజేపీ పని తీరు పట్ల ఏ ముస్లిం మహిళ కూడా సంతోషంగా లేదు. పౌరుల సమస్యను నేరంగా పరిగణించడంతో బీజేపీ త్రిపుల్ తలాక్ రద్దు విఫలమైంది. త్రిపుల్ తలాక్‌ను నేను కూడా మద్దతివ్వను. కానీ బీజేపీ దురుద్దేశాలు నాకు తెలుసు కాబట్టి దానిపై బీజేపీ ప్రభుత్వ చర్యలను సమర్థించను. ముస్లిం యువకులను జైల్లో పెట్టేందుకు దీన్నొక సాకుగా బీజేపీ వాడుకుంటుందని ఇక్రా చౌదరీ పేర్కొన్నారు.

ఇక్రా చౌదరీ తన కుటుంబంలో మూడోతరం రాజకీయ వారసత్వం కలిగిన వ్యక్తి. ఆమె తాత అక్తర్ హాసన్, ఆమె తండ్రి మునవ్వర్ హాసన్ మాజీ ఎంపీలు. ఆమె తల్లి తబస్సుం హాసన్ కూడా 2009, 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇక్రా చౌదరీ అన్న నహిద్ హాసన్ కూడా మూడుసార్లు ఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో జైలు నుంచి పోటీ చేసి కైరానా అసెంబ్లీ సీటును దక్కించుకున్నారు. 


Similar News