Nitin Gadkari: స్టెయిన్ లెస్ స్టీల్ వాడితే విగ్రహం కూలిపోయేది కాదు

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం(Shivaji statue) ధ్వంసమైన ఘటనపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.

Update: 2024-09-04 08:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం(Shivaji statue) ధ్వంసమైన ఘటనపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. అయితే, ఈ విగ్రహం తయారీకి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాడితే ఆ విగ్రహం కూలిపోయి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. సముద్ర తీరానికి దగ్గరగా నిర్మించే బ్రిడ్జిల నిర్మాణంలో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వినియోగించాలని ఆయన సూచించారు. ‘‘నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ముంబైలో 55 ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టాం. ఆ సమయంలో ఓ వ్యక్తి నాకు వాటిని చూపించడానికి తీసుకువెళ్లాడు. అక్కడ వారు ఐరన్ రాడ్స్ పైన కొన్ని పౌడర్-కోటింగ్‌లు వేస్తూ.. అవి మళ్లీ తుప్పు పట్టే అవకాశం లేదని చెప్పారు. కాని అవి తుప్పు పట్టే అవకాశం ఉందని అప్పట్లోనే చెప్పాను. సముద్రానికి 30 కిలోమీటర్ల దగ్గరగా నిర్మించే వంతెనల నిర్మాణంలో స్టెయిన్‌లెస్ స్టీల్ వాడాలని సూచించారు. శివాజీ విగ్రహాన్ని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేసి ఉంటే అది కూలిపోయేది కాదు’’ అని గడ్కరీ అన్నారు.

గడ్కరీ వ్యాఖ్యలపై శరద్ పవార్ ఏమన్నాంటే?

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై స్పందించారు. ఛత్రపతి శివాజీ విగ్రహం ధ్వంసమైన ఘటనపై స్పందించారు. శరద్ పవార్ మాట్లాడుతూ.. "గడ్కరీ ఏ పనిని పూర్తి అంకితభావంతో చేస్తారు. ఆయన పనితీరు బాగుంటుంది. ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్‌వే, కొల్హాపూర్- బెల్గాం రోడ్‌తో పాటు దేశంలో చాలా మంచి రోడ్ల నిర్మాణం జరిగింది. రోడ్ల నిర్మాణానికి నితిన్ గడ్కరీ ఎంతగానో సహకరించారు. ఈ విషయాన్ని పార్లమెంటులోనూ చెప్పాను. ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. అందుకే, నితిన్ గడ్కరీ చెప్పినట్లు విగ్రహం ధ్వంసానికి కారణం అదే అని బావిస్తున్నా. నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఈ కామెంట్లు చేశారని అనకుంటున్నా" అని అన్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటపై ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడానికి ‘అవినీతి’ కారణమని పవార్ ఆరోపించారు.

ఛత్రపతి శివాజీ విగ్రహం ధ్వంసం

నేవీ డే (డిసెంబరు 4) సందర్భంగా గతేడాది రాజ్‌కోట్‌ కోటలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన 35 అడుగుల శివాజీ విగ్రహం ధ్వంసం అయ్యింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విగ్రహం కూలినట్లుగా మొదట అధికారులు అనుమానించారు. అయితే, విగ్రహం కూలడానికి ఆరు రోజుల ముందే విగ్రహమంతా తుప్పుపట్టి ఉందని మహారాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ, నేవీ అధికారులకు తెలిపింది. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకవాలని సూచించింది. కాగా విగ్రహశిల్పి జయదీప్ ఆప్టే పరారీలో ఉండటంతో సింధుదుర్గ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులోనే చేతన్ పాటిల్‌ను అరెస్ట్‌ చేశారు.


Similar News