NIA court: యూపీ కాస్‌గంజ్ అల్లర్ల కేసు.. 28 మంది దోషులకు యావజ్జీవ శిక్ష
2018లో జరిగిన కాస్ గంజ్ అల్లర్ల కేసులో 28 మంది దోషులకు లక్నోలోని ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది.
దిశ, నేషనల్ బ్యూరో: 2018లో జరిగిన కాస్ గంజ్ (Kasganj) అల్లర్ల కేసులో 28 మంది దోషులకు లక్నోలోని ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. హత్య, హత్యాయత్నం, అల్లర్లు, జాతీయ జెండాను అవమానించడం వంటి అభియోగాలపై నిందితులను దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక న్యాయమూర్తి వివేకానంద్ శరణ్ త్రిపాఠి (Sharan thripati) ఈ మేరకు తీర్పు వెల్లడించారు. అలాగే ఒక్కొక్కరికి రూ.80,000 జరిమానా కూడా విధించారు. త్రివర్ణ పతాకాన్ని అవమానించడం, హత్య చేయడం వంటి నేరాలు ఎలాంటి క్షమాపణకు అర్హమైనవి కాదని తెలిపారు. ఈ ఘటన హత్య మాత్రమే కాదు, భారత రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను అవమానించడమేనని పేర్కొన్నారు.
కాగా, 2018 జనవరి 26న విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ పలువురు హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలు తిరంగా యాత్రను నిర్వహించారు. యాత్ర కాస్ గంజ్‌కు చేరుకోగానే ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే హిందూ కార్యకర్త చందన్ గుప్తా బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. దీని తర్వాత నగరం మొత్తం అల్లర్లు చెలరేగాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు2019లో మొత్తం 31 మందిపై అభియోగాలు మోపారు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా తాజాగా తీర్పు వెల్లడైంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు ముగ్గురిని నిర్ధోషులుగా ప్రకటించింది. నిందితులంతా ప్రస్తుతం లక్నో జైలులోనే ఉన్నట్టు తెలుస్తోంది.