'ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేస్తుంది'.. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై ప్రధా మోడీ
న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవనం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. కొత్త భవనం వీడియో క్లిప్ ను ఆయన శుక్రవారం ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ‘మై పార్లమెంట్ - మై ప్రైడ్’ అనే హాష్ ట్యాగ్ తో సొంత వాయిస్ ఓవర్ ను జోడించి షేర్ చేయాలని ప్రజలను కోరారు. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం తెల్లవారుజామున హవన్, సర్వమత ప్రార్థనలతో షురూ అవుతుంది. అనంతరం ప్రధాని మోడీ లోక్ సభను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 25 రాజకీయ పార్టీలు హాజరయ్యే అవకాశం ఉంది. దీన్ని బహిష్కరించాలని 21 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే పార్టీలు బీజేపీ, ఏఐడీఎంకే, అప్నాదళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, శివసేన (షిండే వర్గం), ఎన్ పీపీ, ఎన్ పీఎఫ్, బిజూ జనతాదళ్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, అకాలిదళ్, బీఎస్పీ, జేడీఎస్.
పిల్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు..
పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. న్యాయవాది సీఆర్ జయ సుకిన్ వేసిన ఈ పిల్ అనుమతించేంత బలమైనది కాదని జస్టిస్ జేకే మహేశ్వరి, పీఎస్ నరసింహాలతో కూడిన సుప్రీం వెకేషనల్ బెంచ్ అభిప్రాయపడింది. లోక్ సభ, రాజ్యసభలతో కూడిన పార్లమెంటుకు అధిపతి అయిన రాష్ట్రపతి ప్రారంభించడమే సరైనదన్న పిటిషనర్ వాదనతో బెంచ్ ఏకీభవించలేదు.
మోడీకి జమ్మూకశ్మీర్ లీడర్లు, యాక్టివిస్టుల మద్దతు..
పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని మోడీకి జమ్మూకశ్మీర్ కు చెందిన పలు రాజకీయ పార్టీలు, యాక్టివిస్టులు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం మనకు గర్వకారణమని యాక్టివిస్టు ఆదిల్ హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలన్న ప్రతిపక్షాల నిర్ణయాన్ని చిన్నపిల్లల చేష్టగా గులాం నబీ ఆజాద్ కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అసద్ పార్టీ అధికార ప్రతినిధి ఫిర్దౌస్ చెప్పారు. విపక్షాల పనికిమాలిన అంశాలపై దేశ ప్రజలు ఆసక్తి చూపడం లేదని, ప్రజా ప్రతినిధిగా పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అధికారం మోడీకి ఉందని శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జునైద్ అజీమ్ మట్టు అన్నారు. అయితే.. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని జమ్మూకశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నిర్ణయించింది.
రూ.75 నాణెం విడుదల..
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం ప్రధాని మోడీ రూ.75 నాణెం విడుదల చేస్తారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత 75వ స్వాతంత్ర్య వేడుకలకు చిహ్నంగా ఈ నాణెం ఉంటుంది. నాణేనికి ఒక వైపు అశోక స్తంభం ఉంటుంది. దాని కింద ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది. ఎడమ వైపు దేవనాగరి లిపిలో ‘భారత్’ అని, కుడి వైపు ఆంగ్లంలో ‘ఇండియా’ అని రాసి ఉంటుంది. నాణేనికి రెండో వైపు కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం ఉంటుంది. దాని అంచున దేవనాగరి లిపిలో ‘సంసద్ సంకుల్’ అని, ఆంగ్లంలో ‘పార్లమెంట్ కాంప్లెక్స్’ అని రాసి ఉంటుంది.