లోక్‌సభ ఎన్నికల తర్వాత జనాభా గణన!

2024 లోక్‌సభ ఎన్నికల తరువాత ప్రభుత్వం కొత్త జనాభా గణనను చేపట్టే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.

Update: 2024-03-14 12:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత ప్రభుత్వం కొత్త జనాభా గణనను చేపట్టే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితులను, ఆర్థిక డేటా నాణ్యతను మెరుగుపర్చడానికి ఎన్నికల అనంతరం ఈ పనిని చేపట్టాలని చర్చిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ వర్గాలు తెలిపాయి. గతంలో చివరిసారిగా జనాభా గణన 2011లో జరిగింది. ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా జరగలేదు. జనాభా గణన కోసం 3,00,000 మంది ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గణనకు దాదాపు 12 నెలల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.

చాలా కాలంగా ఆర్థిక వేత్తలు జనాభా గణన చేపట్టాలని కోరుతున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఖర్చులు, ప్రయోజనాలు సంబంధిత ఆర్థిక డేటాపై పూర్తి క్లారిటీ వస్తుందని వారు అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని ఇటీవల ఆర్థిక సలహా మండలి సైతం పేర్కొంది. భారతదేశ ఆర్థికవ్యవస్థ వేగంగా విస్తరిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు క్రమంగా ఇన్వెస్ట్‌మెంట్లను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో జనాభా గణన ద్వారా ప్రజల సంఖ్యకు అనుగుణంగా ప్రయోజనాలను అందించవచ్చని తెలిపింది. పారిశ్రామిక ఉత్పత్తి, GDP డేటా ప్రస్తుతం 2011-12 బేస్ ఇయర్‌ని ఉపయోగించి లెక్కిస్తున్నారు, వినియోగదారు ద్రవ్యోల్బణం కోసం 2012ని ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త గణన ద్వారా వీటి లెక్కింపు బేస్ సంవత్సరం మారుతుంది. కొత్త జనాభా ప్రాతిపదికన వివిధ పథకాల రూపకల్పన, ఖర్చులు, లాభాలను లెక్కించడం, భవిష్యత్తులో ప్రజల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది.


Similar News