జులై 3 వ వారంలో నీట్-యూజీ కౌన్సిలింగ్.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

నీట్-యూజీ పరీక్షకు సంబంధించి పాట్నాలో ప్రశ్నాపత్రం మిస్సయిన దాఖలాలు కనిపించడం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

Update: 2024-07-11 04:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్-యూజీ పరీక్షకు సంబంధించి పాట్నాలో ప్రశ్నాపత్రం మిస్సయిన దాఖలాలు కనిపించడం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీంతో పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రశ్నపత్రం తప్పిపోయినట్లు ఎక్కడా కనిపించలేదు. ప్రతి ప్రశ్నాపత్రం ప్రత్యేక క్రమ సంఖ్యను కలిగి ఉంటుంది. దీనిని నిర్దిష్ట అభ్యర్థికి కేటాయించాం. ఎన్‌‌టీఏ పరిశీలకులు కమాండ్‌లోని CCTV కవరేజ్‌కు కూడా చూశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదా పేపర్ లీకేజీ జరగలేదని కేంద్రం పేర్కొంది.

అదనంగా, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అదనపు అఫిడవిట్‌ను సమర్పించింది, 2024-25 విద్యా సంవత్సరానికి, నీట్-యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ జులై మూడవ వారం నుండి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఒకవేళ కౌన్సిలింగ్‌లో ఎవరైనా నీట్ పరీక్ష అక్రమాల కారణంగా లబ్ది పొందినట్లు గుర్తిస్తే, వారి కౌన్సిలింగ్‌ను రద్దు చేస్తామని కోర్టుకు కేంద్రం తెలియజేసింది.

ఇదిలా ఉంటే ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వివాదాస్పదమైన నీట్-యూజీ మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన వరుసగా దాఖలైన 40 పిటిషన్లను గురువారం విచారించనుంది. ఈ పిటిషన్లలో మే 5న పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, తాజాగా పరీక్షకు సంబంధించిన అభ్యర్థనలు ఉన్నాయి. పరీక్షలో అవకతవకలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), బీహార్ కేసుకు సంబంధించి ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.


Similar News