Neet final results: రెండు రోజుల్లో నీట్ తుది ఫలితాలు..కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
నీట్ యూజీ తుది ఫలితాలను రెండు రోజుల్లోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ తుది ఫలితాలను రెండు రోజుల్లోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా మెరిట్ జాబితాను అప్‌డేట్ చేస్తామని చెప్పారు. పరీక్షల సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నీట్ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని చెప్పారు. తీర్పు తర్వాత ప్రతిపక్షాల పాత్ర ఏంటో స్పష్టంగా అర్ధమైందన్నారు. దేశంలోని విద్యార్థులను తప్పుదారి పట్టించడం, గందరగోళాన్ని సృష్టించడంలో వారి పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ప్రతిపక్షాలు విద్యార్థులకు, వారి తల్లి దండ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.