బిహార్‌లో 40 స్థానాల్లో ఎన్డీయేదే విజయం: ప్రధాని నరేంద్ర మోడీ దీమా
బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ దీమా వ్యక్తం చేశారు. అందుకోసం రాష్ట్ర ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని స్పష్టం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ దీమా వ్యక్తం చేశారు. అందుకోసం రాష్ట్ర ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. బిహార్ పర్యటనలో ఉన్న మోడీ గురువారం జముయ్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయే కూటమిలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు. ప్రస్తుతం బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలు ఎన్నికల ర్యాలీల్లా లేవని..అవి విజయోత్సవ ర్యాలీల్లా ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు బిహార్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి బయపడేవారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పారు. బీజేపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వెల్లడించారు. కేవలం బిహారే గాక దేశమంతా బీజేపీ, ఎన్డీయేలకు అనుకూలంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్, ఆర్జేడీలు దేశానికి చెడ్డపేరు తీసుకొచ్చాయని విమర్శించారు. ఎల్‌జేపీ(రామ్ విలాస్ పాశ్వాన్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ..తమ పార్టీకి ఐదు సీట్లు కేటాంచినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 400 సీట్లు పోరాటానికి తాము పూర్తి అండగా నిలుస్తామని తెలిపారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ కూడా బిహార్‌లో పర్యటించి తమ అభ్యర్థుల తరఫున పోరాటం చేయనున్నారు.