కళ్ల ముందు అంత ఘోరం జరుగుతున్నా స్పదించకపోవడం విచారకరం.. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ
మైనర్ బాలిక సాక్షి హత్యా ఘటనపై నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్ పర్సన్ రేఖా శర్మ స్పందించారు.
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో ఆదివారం జరిగిన మైనర్ బాలిక హత్యపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ స్పందించారు. మైనర్ బాలిక సాక్షిని ఆమె ప్రియుడు కత్తితో పొడిచి చంపుతుంటే అక్కడ చాలా మంది ఉన్నారని, కానీ ఏ ఒక్కరూ స్పందించకపోవడం విచారకరం అన్నారు. వాళ్లు స్పందించి ఉంటే ఆమె బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులు కూడా ఈ విధంగా ప్రవర్తించరని అన్నారు. ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తీర్పు త్వరగా వచ్చేలా చేయాలని న్యాయవ్యవస్థను అభ్యర్థించారు.
కాగా ఢిల్లీలోని రోహిణి ఏరియాలో సాహిల్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి సాక్షి (16) అనే మైనర్ బాలికను కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేశాడు. దాదాపు 21 సార్లు ఆమెను కత్తితో పొడిచినట్లు, అంతటితో ఆగకుండా పెద్ద బండి రాయిని ఆమె తలపై మోది చంపినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.