Nasa: క్రూ-10 మిషన్ విజయవంతం
గత 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్(Sunita Williams) , బచ్ విల్మోర్ (Butch Wilmore) త్వరలోనే భూమి మీదకు రానున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: గత 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్(Sunita Williams) , బచ్ విల్మోర్ (Butch Wilmore) త్వరలోనే భూమి మీదకు రానున్నారు. వారిని తీసుకొచ్చేందుకు నాసా- స్పేస్ ఎక్స్ లు ప్రయోగించిన క్రూ-10 మిషన్(Crew-10 mission) ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)తో విజయవంతంగా అనుసంధానమైంది. ఆదివారం ఉదయం 9: 37 గంటలకు ఈ డాకింగ్ ప్రక్రియ జరిగినట్లు నాసా తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సునితా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ స్థానంలో అక్కడికి వెళ్లిన నలుగురు ఆస్ట్రోనాట్స్ పనిచేయనున్నారు. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ కు చెందిన టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకొన్నారు. వీరికి సునీత, విల్మోర్ స్వాగతం పలికారు.
ఫాల్కన్-9 రాకెట్
కాగా.. శనివారం తెల్లవారుజామున 4.33 గంటలకు క్రూ డ్రాగన్ స్పేస్ షిప్ ను అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయించారు. క్రూ-10 మిషన్‌లో భాగంగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఇకపోతే, 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునితా, బుచ్ విల్మోర్ లు ఐఎస్‌ఎస్ (ISS)కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వారిద్దరూ వారం రోజులకే భూమిపైకి రావాల్సి ఉండగా.. అది కుదర్లేదు. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు. అయితే, ప్రస్తుతం వారు క్రూ-10లోనే భూమిపైకి తిరిగి రానున్నారు.