Narco-terror network: కశ్మీర్‌లో ఉగ్రవాదులకు సాయం.. ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్
జమ్మూ కశ్మీర్‌లో మాదకద్రవ్యాలను విక్రయించి ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేస్తున్నారనే ఆరోపణలపై ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో మాదకద్రవ్యాలను విక్రయించి ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేస్తున్నారనే ఆరోపణలపై ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. వీరిలో ఐదుగురు పోలీసులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. వీరంతా పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, దాని అనుబంధ ఉగ్ర సంస్థల నార్కో-టెర్రర్ నెట్‌వర్క్‌లో భాగమయ్యారని తెలిపారు. విధుల నుంచి తొలగించిన వారిని హెడ్ కానిస్టేబుల్ ఫరూక్ అహ్మద్ షేక్, కానిస్టేబుల్స్ సైఫ్ దిన్, ఖలీద్ హుస్సేన్ షా, ఇర్షాద్ అహ్మద్ చల్కూ, రహ్మత్ షా, టీచర్ నజామ్ దిన్‌గా గుర్తించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సీ)ని ఉపయోగించి వారిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితులుగా గుర్తించారు. వీరంతా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టి ఉగ్రవాదులకు నిధులు సమకూరస్తున్నట్టు తెలిపారు. బ్రౌన్ షుగర్, హెరాయిన్ వంటివి పాక్ నుంచి జమ్మూ కశ్మీర్‌కి అక్రమంగా రవాణా చేసినట్టు వెల్లడించారు. ఈ సమాచారాన్ని ఇంటలిజెన్స్ వర్గాలు సైతం ధ్రువీకరించినట్టు తెలుస్తోంది. దీనిపై సాక్షాధారాలను కూడా సేకరించినట్టు సమాచారం.