బిహార్‌కు నడ్డా, బెంగాల్‌కు అమిత్ మాలవీయ: పలు రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌ల నియామకం

రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బీజేపీ ఇన్‌చార్జ్, కో ఇన్‌చార్జ్‌లను శనివారం నియమించింది.

Update: 2024-01-27 09:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బీజేపీ ఇన్‌చార్జ్, కో ఇన్‌చార్జ్‌లను శనివారం నియమించింది. పార్టీలోని ప్రముఖ నేతలకు ఆయా రాష్ట్రాల వ్యవహారాల బాధ్యతలను అప్పగించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు జైజయంత్ జే పాండాకు ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని పంజాబ్ ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఇక, టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ, మంగళ్ పాండే, ఆశా లక్రాలకు అప్పగించారు. మధ్యప్రదేశ్‌కు ఇన్‌చార్జ్, కో ఇన్‌చార్జ్‌గా మహేంద్ర సింగ్‌, సతీష్ ఉపాధ్యాయ్‌లు వ్యవహరించనున్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటకకు ఇన్‌చార్జ్‌గా రాధామోహన్‌ అగర్వాల్‌, కో-ఇన్‌చార్జ్‌గా సుధాకర్‌ రెడ్డిలను ప్రకటించారు. రాజకీయ సంక్షోభం నెలకొంటున్న తరుణంలో బిహార్‌కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, వినోద్ తావ్డే, దీపక్ ప్రకాష్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. జమ్మూ కశ్మీర్‌కు తరుణ్ చుగ్, ఆశిష్ సూద్, జార్ఖండ్‌కు లక్ష్మీకాంత్ వాజ్‌పేయి, హర్యానా విప్లవ్ దేవ్ లను అపాయింట్ చేశారు. అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌కు శ్రీకాంత్ శర్మ, సంజయ్ టాండన్‌లను కాషాయ పార్టీ ఇన్ చార్జ్‌లుగా ప్రకటించింది. కాగా, లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ స్ట్రాటజీ అమలు చేసినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News