Mva: మహారాష్ట్రలో ఎంవీఏ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గాను ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి తన ఉమ్మడి మేనిఫెస్టోను ఆదివారం రిలీజ్ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections)కు గాను ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి తన ఉమ్మడి మేనిఫెస్టోను ఆదివారం రిలీజ్ చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge), ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే (Supriya sule), శివసేన(UBT) నేత సంజయ్ రౌత్(Sanjay raut)లు మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని ఓటర్లపై మేనిఫెస్టోలో ఎంవీఏ వరాల జల్లు కురిపించింది. ఎంవీఏ కూటమి అధికారంలోకి వస్తే మహాలక్ష్మి యోజన (Mahalaxmi Yojana) పథకం కింద మహిళలకు నెలకు రూ.3000 అందజేస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపింది. రూ.500కే ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్టు పేర్కొంది. అంతేగాక 9 నుంచి16 ఏళ్లలోపు ఉన్న బాలికలకు ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, ప్రతి నెలా రెండు రోజుల పీరియడ్ లీవ్ అందిస్తామని వెల్లడించింది. యువతకు నెలకు రూ.4000 నిరుద్యోగ భృతి కల్పించనున్నట్టు తెలిపింది.
రైతు ఆత్మహత్యల నియంత్రణకు కృషి
రైతు ఆత్మహత్యలను నియంత్రించడానికి, సూసైడ్‌కు పాల్పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఓ పథకాన్ని తీసుకొస్తామని తెలిపింది. అందుకు గాను ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూస్తామని హామీ ఇచ్చింది. ఆరోగ్య బీమా పాలసీని విస్తరిస్తామని, రాష్ట్రంలో కులగణన చేపడతామని తెలిపింది. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు అందజేస్తామని పేర్కొంది.
దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు: ఖర్గే
ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ప్రపంచం మొత్తం మహారాష్ట్ర ఎన్నికల వైపే చూస్తోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని ఇవి దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని చెప్పారు. సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పడం ఎంవీఏ ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపారు. ప్రజలు ఎంవీఏ కూటమిని ఆదరించాలని సూచించారు. కాగా, మహారాష్ట్రలోని ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన(యూబీటీ) పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి.