యోగి సర్కారుకు సుప్రీం మొట్టికాయలు.. ముస్లిం స్టూడెంట్‌కు చెంపదెబ్బల కేసులో కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : క్లాస్‌మేట్లతో ఒక ముస్లిం పిల్లవాడిని స్కూల్ టీచర్ చెంపదెబ్బలు కొట్టించిన వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : క్లాస్‌మేట్లతో ఒక ముస్లిం పిల్లవాడిని స్కూల్ టీచర్ చెంపదెబ్బలు కొట్టించిన వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతేడాది ఆగస్టులో ముజఫర్‌నగర్‌లోని ఖుబ్బాపూర్ గ్రామంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఈ అమానుష వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ సర్కారు తగిన విధంగా స్పందించలేదని కామెంట్ చేసింది. ఈ ఘటనకు వేదికగా నిలిచిన పాఠశాలను సీల్ వేయడం మినహా.. అలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా నిలువరించే విద్యారంగ సంస్కరణలను చేపట్టలేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తోటి విద్యార్థులతో ముస్లిం విద్యార్థికి చెంపదెబ్బలు కొట్టించిన టీచర్ త్రిప్తా త్యాగిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ విచారణ చేపట్టింది. ‘‘ఈ ఘటన విద్యాహక్కు చట్టంలోని నిబంధనలకు విరుద్ధం. అది జరిగిన తర్వాత.. మా పిల్లవాడిని ఇంటి నుంచి చాలా దూరంగా ఉన్న కొత్త స్కూల్‌లో చేర్పించాల్సి వచ్చింది.. ఎందుకంటే మా ఇంటికి దగ్గర్లో స్కూల్స్ లేవు’’ అని బాధిత బాలుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రూపొందించిన నివేదికలోని సిఫార్సుల ఆధారంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని యూపీ సర్కారుకు సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ సిఫార్సుల ఆధారంగానే చెంపదెబ్బ కొట్టిన విద్యార్థులకు, వారికి ఆ ఆదేశమిచ్చిన టీచర్‌కు కౌన్సెలింగ్ చేయాలని సూచించింది.