పీఓకేలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య
Muzaffarabad unrest: 3 killed in Pakistan-occupied Kashmir as strike enters 5th day, Govt allocates aid
దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముజఫరాబాద్‌లోని అసెంబ్లీని చుట్టుముట్టేందుకు యత్నించారు ఆందోళనకారులు. పీఓకేలో వరుసగా ఐదోరోజు ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్ అయ్యాయి. శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి.
హింసాత్మక ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. మృతుల్లో ఇద్దరు ఆందోళనకారులు, ఒక ఎస్‌ఐ ఉన్నారు. ఆదివారం జరిగిన ఘర్షణలో 100 మందికి పైగా గాయపడ్డారు. గత ఐదు రోజులుగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల పెంపునకు వ్యతిరేకంగా రాజధాని ముజఫరాబాద్‌కు మార్చ్‌కు పిలుపునిచ్చారు. పీఓకేలోని సామాజిక కార్యకర్తలు, వ్యాపారులు, న్యాయవాదులతో ఏర్పడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. లక్షలాది మంది నిరసనకారులు ముజఫరాబాద్ వైపు లాంగ్ మార్చ్ కొనసాగించారు. మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు బలవంతంగా ప్రయోగించడంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇదిలా ఉండగా, నిరసనకారులను శాంతింపజేయడానికి, పాకిస్థాన్ ప్రభుత్వం రూ.23 బిలియన్ల బడ్జెట్‌ను కేటాయించింది. పీఓకేలో హింసాత్మక నిరసనల తర్వాత, రేంజర్లు వీధుల్లోకి వచ్చారు. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ముఖ్యనేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక ప్రభుత్వం కూడా విద్యుత్ ధరలు, రొట్టె ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. షాబాజ్ షరీఫ్‌తో సమావేశం ముగిసిన వెంటనే, పీఓకే ప్రధాని హక్ విద్యుత్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. హక్ మాట్లాడుతూ.. స్థానిక నివాసితులు గత కొన్ని రోజులుగా విద్యుత్, నిత్యావసరాలపై సబ్సిడీని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. వారి డిమాండ్లను నెరవేరుస్తామని ప్రకటించారు.