మార్స్‌పై క్రేటర్లకు యూపీ, బీహార్‌లోని పట్టణాల పేర్లు

ఐఏయూ ఈ క్రేటర్లకు మాజీ పీఆర్ఎల్ డైరెక్టర్, రెండు భారతీయ పట్టణాల పేర్లు పెట్టేందుకు ఆమోదించింది.

Update: 2024-06-12 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ(పీఆర్ఎల్) శాస్త్రవేత్తలు మార్స్‌పై కొత్తగా మూడు క్రేటర్ల(బిలాలు)ను కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్(ఐఏయూ) ఈ క్రేటర్లకు మాజీ పీఆర్ఎల్ డైరెక్టర్, రెండు భారతీయ పట్టణాల పేర్లు పెట్టేందుకు ఆమోదించింది. మార్స్‌పై థార్సిస్ అగ్నిపర్వత ప్రాంతంలో ఉన్న ఈ మూడు క్రేట్లకు అధికారికంగా లాల్ క్రేటర్, ముర్సన్ క్రేటర్, హిల్సా క్రేటర్‌గా గుర్తించారు. 65 కి.మీ వెడల్పు గల క్రేటర్‌కు 1972-1983 మధ్య పీఆర్ఎల్‌కు నాయకత్వం వహించిన ప్రఖ్యాత భారత భూభౌతిక శాస్త్రవేత్త, మాజీ పీఆర్ఎల్ డైరెక్టర్ ప్రొ దేవేంద్ర లాల్ గౌరవార్థం 'లాల్ క్రేటర్ ' పేరు పెట్టారు. ప్రొఫెసర్ దేవేంద్ర లాల్ కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త. ఆయన భూమి, గ్రహాలకు సంబంధించిన పరిశోధన చేశారు. ఇక, మార్స్‌పై తూర్పు అంచున 10 కి.మీ వెడల్పు ఉన్న క్రేటర్‌కు దేశీయంగా ఉత్తరప్రదేశ్‌లోని పట్టణం పేరు మీద 'ముర్సన్ క్రేటర్' అని పేరు పెట్టారు. పీఆర్ఎల్ ప్రస్తుతం డైరెక్టర్, ప్రఖ్యాత గ్రహాల శాస్త్రవేత్త డా అనిల్ భరద్వాజ్ జన్మస్థలం ముర్సాన్. అందుకే ఆ పేరును ఎంచుకున్నారు. అలాగే, మాస్‌పై కొత్త క్రేటర్లను కనుగొనే పరిశోధనలో భాగమైన పీఆర్ఎల్ శాస్త్రవేత్త డా రాజీవ్ రంజన్ భారతి జన్మస్థలాన్ని మార్స్‌పై పశ్చిమ అంచున మరో 10 కి.మీ వెడల్పు ఉన్న బిలానికి బీహార్‌లోని పట్టణం పేరును తీసుకుని 'హిల్సా క్రేటర్' గా నామకరణం చేశారు. 


Similar News