Mpox: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మంకీపాక్స్ కేసు.. పాకిస్తాన్‌లో నాలుగవది
ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయని ఆసుపత్రి ఫోకల్ పర్సన్ డాక్టర్ నసీమ్ అక్తర్ చెప్పారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా నాలుగు అనుమానిత కేసులు ఉన్నట్టు పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ 47 ఏళ్ల ఓ వ్యక్తి సౌదీ అరేబియాలోని జెద్దా నుంచి పాక్‌కు వచ్చి, మంకీపాక్స్ లక్షణాలతో ఇస్లామాబాద్‌లోని పాక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(పిమ్స్)లో చేరినట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయని, పిమ్స్‌లో అతన్ని ప్రత్యేక వార్డులో ఉంచినట్టు ఆసుపత్రి ఫోకల్ పర్సన్ డాక్టర్ నసీమ్ అక్తర్ చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయని గుర్తించిన పాకిస్తాన్ ప్రభుత్వం తక్షణం విమానాశ్రయాల్లో మరింత కఠినమైన స్క్రీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాగా, ఇప్పటికే ప్రపంచవ్యాప్త్నగా మంకీపాక్స్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గుర్తిచేస్తోంది. స్వీడన్‌లో ఇప్పటికే పలు కేసులు నమోదవగా, ఇటీవల ఫిలిప్పీన్‌లో సైతం మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు 15,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 537 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. భారత్‌లో ఈ ఏడాది మార్చిలో ఒక కేసు నమోదైంది.