MP RESULTS : ట్రిపుల్ సెంచరీ దిశగా ఎన్డీఏ కూటమి..
పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కాస్త మసకబారింది.
దిశ, తెలంగాణ బ్యూరో : పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కాస్త మసకబారింది. మరే పార్టీకంటే ఎక్కువ సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించినా ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటలేకపోయింది. మధ్యహ్నం 12 గంటల సమయానికి ట్రిపుల్ సెంచరీని దాటలేపోయిన ఎన్డీఏ పలు రాష్ట్రాల్లో తన ప్రాభవాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. ‘యూపీఏ’ నుంచి ‘ఇండియా’గా మారుస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం సక్సెస్ అయింది. ఎన్డీఏ కూటమి గతంతో పోలిస్తే దాదాపు 50 సీట్లను కోల్పోగా ‘ఇండియా’ టీమ్ మాత్రం సుమారు 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర ఈసారి బీజేపీకి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అంచనాలు పటాపంచలయ్యాయి. మొత్తం 80 స్థానాలున్న ఆ రాష్ట్రంలో బీజేపీకి గతంలో ఉన్న 62 స్థానాలు ఈసారి దాదాపుగా సగానికి తగ్గిపోయి 34 స్థానాలకే పరిమితమైంది. గతంలో కేవలం ఐదు సీట్లున్న సమాజ్‌వాదీ పార్టీ మాత్రం ఏకంగా 30 స్థానాలకు అదనంగా గెల్చుకుని 35కు చేరుకున్నది. కాంగ్రెస్ సైతం తన ఒక్క సిట్టింగ్ స్థానాన్ని ఈసారి 7కు పెంచుకున్నది. బిహార్‌లో కూటమిగా తన స్థానాన్ని ఎన్డీఏ పదిలపర్చుకున్నా ఆర్జేడీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. కర్ణాటకలో గత ఎన్నికల్లో 25 స్థానాల్లో గెలుపొందినా ఈసారి ఏడు స్థానాలను కోల్పోవడంతో వాటిని కాంగ్రెస్ దక్కించుకుంటున్నది. ఒక్క స్థానం నుంచి ఏడు వరకు కాంగ్రెస్ తన గ్రాఫ్‌ను పెంచుకున్నది. హర్యానాలో సైతం బీజేపీపై నెలకొన్న అసంతృప్తి చివరకు ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది.
వర్కవుట్ కాని ‘మోడీ గ్యారంటీ’
వాజ్‌పేయి హయాంలో ‘ఇండియా షైనింగ్’ స్లోగన్‌తో ఎన్నికల్లోకి వెళ్ళి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన బీజేపీ ఈసారి ‘మోడీ గ్యారంటీ’ కూడా పెద్దగా సక్సెస్ కాలేదని ఓట్ల లెక్కింపు గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. ఈ దేశానికి మోడీ నాయకత్వమే శ్రీరామరక్ష తరహాలో మోడీ ఒకసారి గ్యారంటీ ఇస్తే అది అమలు కావడం గ్యారంటీ... అంటూ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రస్తావించారు. కానీ ‘మోడీ గ్యారంటీ’ పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ ‘ఇండియా’ కూటమి మాత్రం షైన్ అయింది. గతంతో పోలిస్తే 100 సీట్లలో గెలుపునకు దగ్గరవుతున్నది. ఎన్డీఏ కోల్పోతున్న 50 సీట్లతో పాటు మరో 50 సీట్లను ‘ఇండియా’ తన ఖాతాలో వేసుకుంటున్నది. కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కొన్ని సీట్లను ఈ కూటమి కైవశం చేసుకుంటున్నది.
దీదీని ఢీకొట్టలేకపోయిన బీజేపీ
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో బీజేపీ తలపడలేకపోయింది. మొత్తం 42 స్థానాలున్న ఆ రాష్ట్రంలో బీజేపీ గతంలో 18 స్థానాల్లో గెలిచినా ఈసారి మాత్రం 10 సీట్ల దగ్గరే ఆగిపోతున్నది. తృణమూల్ కాంగ్రెస్ గతంలో 22 స్థానాల్లో గెలుపొందగా ఈసారి మరో ఏడు స్థానాలను అదనంగా గెల్చుకుని 29కు చేరువవుతున్నది. కాంగ్రెస్ సైతం గతంలో కేవలం రెండు స్థానాల్లోనే గెలుపొందితే ఈసారి మరో రెండింటిని అదనంగా గెల్చుకునే అవకాశాలున్నాయి. మూడు టర్ములుగా ఆ రాష్ట్రంలో పవర్‌లో ఉన్న మమతా బెనర్జీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందని కమలనాధులు అంచనా వేశారు. కానీ ఈ అంచనాలు తలకిందులయ్యాయి. ‘ఇండియా’ టీమ్‌లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో విడిగా పోటీ చేయడంతో మమతాబెనర్జీ ఫార్ములా వర్కవుట్ అయింది.
ఏపీలో వార్ వన్ సైడ్ ఫైట్
ఐదేండ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఈసారి ఊహించనంత స్థాయిలో ఓటమిని మూటగట్టుకున్నది. ‘నవరత్నాలు’ పేరుతో ప్రతి ఇంటినీ సంక్షేమ పథకాలతో ఆకట్టుకున్నామన్న ధీమా పటాపంచలైంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చినన్ని సీట్లు (23) కూడా ఈసారి రాకపోవడం (21) గమనార్హం. సరిగ్గా ఎన్నికలకు ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో వైఎస్సార్సీపీకి ఊహించని దెబ్బ తగిలింది. మూడు రాజధానుల ఫార్ములా, విశాఖపట్నంకు పరిపాలనా కేంద్రాన్ని షిప్ట్ చేయాలన్న నిర్ణయం బెడిసికొట్టింది. ఈ ప్రభావం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలలో ప్రస్ఫుటంగా కనిపించింది. చరిత్రలోనే మొదటిసారి కమ్మ, కాపు ఈక్వేషన్ సక్సెస్ ఫార్ములాగా మారింది. ఫస్ట్ టైమ్ జనసేన 20 సీట్లలో ఆధిక్యంలో ఉండడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతగా శక్తివంతంగా మారింది.
తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఊహించనంత పరాభావాన్ని చవిచూసింది. గత ఎన్నికల్లో దాదాపు 42% ఓటు బ్యాంకుతో తొమ్మిది స్థానాలను గెల్చుకున్నా ఈసారి ఒక్కచోట గెలవడానికి కూడా ఆపసోపాలు పడాల్సి వచ్చింది. గట్టి పట్టు ఉన్న ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సైతం ఆశించినంత ప్రభావాన్ని చూపించలేకపోయింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొన్నిది. రెండు పార్టీలూ డబుల్ డిజిట్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా చెరి సగంగా 8 సీట్ల చొప్పున ఆధిక్యంలో ఉన్నాయి. మజ్లిస్ మాత్రం తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. తెలంగాణను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు నెల రోజుల వ్యవధిలో వారం రోజుల చొప్పున తిష్ట వేసి ప్రచారం చేశారు. డబుల్ డిజిట్ టార్గెట్ చేరుకోలేకపోయినా అథికార కాంగ్రెస్‌ను డిఫెన్సులో పడేసింది.