ఢాకా: బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ షహబుద్దీన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధికార అవామీ లీగ్ తరఫున ఆయన ఫిబ్రవరిలో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా 73 ఏళ్ల షహబుద్దీన్ తో స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదరి ప్రమాణం చేయించారు. ఆదివారం పదవీకాలం ముగిసిన అబ్దుల్ హమీద్ స్థానంలో షహబుద్దీన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. 1949లో పాబ్నా జిల్లాలో పుట్టిన షహబుద్దీన్ జిల్లా జడ్జిగా రిటైర్ అయ్యారు. విద్యార్థి దశలోనే అవామీ లీగ్ పార్టీలో చేరిన ఆయన పార్టీ యువజన విభాగానికి కూడా నాయకత్వం వహించారు. ఆయన భార్య రెబెకా సుల్తానా ప్రభుత్వ మాజీ సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు.