72 మందితో మోడీ కేబినెట్..ప్రముఖులు వీరే?

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.

Update: 2024-06-09 17:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. దీంతో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రికార్డ్ మోడీ సొంతం చేసుకున్నారు. మోడీతో సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్, ఐదుగురికి స్వతంత్ర, 36 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. మోడీ తర్వాత వరుసగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్‌, నిర్మలా సీతారామన్‌, జైశంకర్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్‌లు ప్రమాణం చేశారు. అయితే మంత్రులెవరికీ పోర్ట్ ఫోలియోలను కేటాయించలేదు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాధి నేతలతో సహా.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే సుమారు 8000 మంది అతిథులు అటెండ్ అయ్యారు.

24 రాష్ట్రాలకు ప్రాతినిథ్యం

మోడీ ప్రభుత్వంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు చెందిన 11 మందికి కేబినెట్‌లో చోటు దక్కగా..మొత్తం 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. 72 మందిలో 43 మంది మూడు పర్యాయాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పార్లమెంటుకు ఎన్నికైన వారు ఉండగా..39 మంది ఇంతకు ముందు కేంద్రంలో మంత్రులుగా పని చేసిన వారు ఉండటం గమనార్హం. అలాగే అన్ని సామాజిక వర్గాలను సైతం మంత్రి మండలిలో భాగస్వామ్యం చేశారు. ఓబీసీ 27, షెడ్యూల్డ్ కులాల నుంచి 10, షెడ్యూల్డ్ తెగల నుంచి ఐదుగురు, మైనారిటీల నుంచి ఐదుగురుకి మంత్రి పదవులు దక్కాయి. మిత్రపక్ష పార్టీల్లో జేడీఎస్ నుంచి హెచ్‌డీ కుమారస్వామి, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం)కు చెందిన జితన్ రామ్ మాంఝీ, జేడీయూ నుంచి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్), ఎల్ జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్‌లకు కేబినెట్ హోదా దక్కింది. ఇక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడికి అవకాశం లభించింది.

తిరిగి మంత్రి వర్గంలోకి నడ్డా

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తిరిగి మంత్రి వర్గంలో చేరారు. ఆయన 2014-19 మధ్య ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే ఆయన పదవీ కాలం ముగియనుండటంతో కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించారు. ఇక, తమిళనాడులోని నీలగిరి నుంచి ఎల్ మురుగన్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతేగాక కేరళకు చెందిన జార్జ్ కురియన్‌కు కూడా చోటు దక్కగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవడం గమనార్హం.

హాజరైన ప్రముఖులు, విదేశీ నేతలు

మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సార్క్ సభ్యదేశాల ప్రతినిధులతో పాటు.. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, నేపాల్‌ ప్రధాని ప్రచండ, మారిసస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌, భూటాన్‌ ప్రధాని షెరింగ్ టోబ్గే, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్‌లు హాజరయ్యారు. అలాగే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పలువురు గవర్నర్లు హాజరయ్యారు. అంతేగాక అదానీ సంస్థ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేస్ అంబానీ, సినీ ప్రముఖులు షారుఖ్ ఖాన్, రజనీ కాంత్, అక్షయ్ కుమార్‌లు కూడా అటెండ్ అయ్యారు. 


Similar News