నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ అనే నేను..
దిశ, నేషనల్ బ్యూరో : వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నరేంద్రమోడీ సిద్ధమయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో : వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నరేంద్రమోడీ సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి 7:15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా ‘‘నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ అనే నేను’’.. అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ రికార్డును మోడీ సమం చేయనున్నారు. మన దేశంలో ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన నాయకుడు నెహ్రూ మాత్రమే. మళ్లీ ఇప్పుడు ఆ ఘనతను మోడీ సొంతం చేసుకోబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రితో పాటు దాదాపు 27 నుంచి 30 కేంద్ర మంత్రిమండలి సభ్యులతో పదవీ ప్రమాణం చేయించనున్నారు. వీరిలో దాదాపు మూడోవంతు మంది ఎన్డీయే కూటమి మిత్రపక్షాల ఎంపీలే ఉంటారని అంచనా. కొందరు కేంద్ర సహాయ మంత్రులుగానూ ప్రమాణం చేయనున్నారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు 8వేల మంది అతిథులు హాజరుకాబోతున్నారు. ఏడు పొరుగు దేశాల ప్రభుత్వాధినేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వారెవరు అంటే.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ ముయిజ్జు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’, భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే. విదేశీ ప్రముఖులు బస చేసే లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్, ఒబెరాయ్ వంటి ప్రముఖ హోటళ్ల వద్ద భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఇక రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లను మోహరించారు. జూన్ 9 నుంచి 10 వరకు ఢిల్లీని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రతి శనివారం ‘ఛేంజ్ ఆఫ్ గార్డ్’ కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో ‘ఛేంజ్ ఆఫ్ గార్డ్’ కార్యక్రమాన్ని జూన్ 8న రద్దు చేశారు. ఇక లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉన్నందున జూన్ 15న, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నందున జూన్ 22న కూడా ‘ఛేంజ్ ఆఫ్ గార్డ్’ కార్యక్రమాన్ని రద్దు చేశారు.
జూన్ 15న లోక్‌సభ సెషన్ షురూ
18వ లోక్‌సభ మొదటి సెషన్ జూన్ 15న ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు మొదటి రెండు రోజుల్లో (15, 16 తేదీల్లో) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కొత్త లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. తదుపరిగా లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. దీంతో పార్లమెంటు కొత్త సెషన్ అధికారికంగా ప్రారంభమవుతుంది. జూన్ 22న ఈ సెషన్ ముగిసే అవకాశం ఉంటుంది.
మాకు ఆహ్వానం అందలేదు: జైరాం రమేష్
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని ఇండియా కూటమి నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు.కేవలం అంతర్జాతీయ నేతలను మాత్రమే ఆహ్వానించారని, భారతీయ నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదన్నారు. ఇండియా కూటమి నేతలకు ఆహ్వానాలు అందినప్పుడు ఆ వేడుకకు వెళ్లడం గురించి ఆలోచిస్తామని చెప్పారు.