Rahul Gandhi: రాహుల్ హత్యకు కుట్ర జరుగుతోంది.. ఎన్డీఏ నేతలపై కాంగ్రెస్ ఫిర్యాదు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Update: 2024-09-18 09:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ పంపారు. రాహుల్ గాంధీని ఉగ్రవాది అని సంభోదిస్తూ పలువురు బీజేపీ నేతలు, వారి మిత్రపక్షాలు ఆయనపై దాడి చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రాహుల్‌ పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ.. వారి సమస్యలు పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని గుర్తుచేశారు. ఇది బీజేపీకి, దాని మిత్రవర్గాలకు నచ్చట్లేదని మాకెన్ మండిపడ్డారు. అందుకే, రాహుల్ పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ, హత్యకు కుట్రపన్నుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాహుల్ పై బహిరంగంగా బెదిరింపులకు పాల్పడిన బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా, కేంద్రసహాయమంత్రి రవ్ నీత్ బిట్టు, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్పందించిన స్టాలిన్

కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బెదిరింపులు చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. "నా సోదరుడు రాహుల్ గాంధీ చరిష్మా, ఆయనకు పెరుగుతున్న మద్దతు చాలా మందిని అశాంతికి గురిచేసింది. దీంతో, ఇలాంటి నీచమైన బెదిరింపు చర్యకు దారితీసింది" అని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. అన్నారాయన. లోక్‌సభలో ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు, హింసకు స్థానం లేదని నొక్కిచెప్పారు.


Similar News