నీటి సంక్షోభంపై లెఫ్టినెంట్ గవర్నర్‌తో అత్యవసర సమావేశాన్ని కోరిన మంత్రి అతిషి

దేశ రాజధాని ఢిల్లీలో తాగునీటి అవసరాలు తీర్చే ముఖ్యమైన మునాక్ కెనాల్‌కు హర్యానా తక్కువగా నీటిని విడుదల చేస్తుందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు.

Update: 2024-06-09 06:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో తాగునీటి అవసరాలు తీర్చే ముఖ్యమైన మునాక్ కెనాల్‌కు హర్యానా తక్కువగా నీటిని విడుదల చేస్తుందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. ఈ సమస్య గురించి చర్చించడానికి ఆమె ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో అత్యవసర సమావేశం కోరారు. కెనాల్ నుంచి ఢిల్లీకి 1,050 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా అది కేవలం 840 క్యూసెక్కులకు తగ్గిపోయిందని మంత్రి ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. నీరు తక్కువగా రావడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దేశ రాజధానిలో నీటి కొరత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో వాటా ప్రకారం రావాల్సిన దానికంటే తక్కువగా నీరు విడుదల అవుతుందని ఆమె అన్నారు.

మునాక్ కెనాల్ ద్వారా తాగునీటి అవసరాలు చాలా వరకు తీరుతాయి. అలాంటిది తక్కువ మొత్తంలో నీటి సరఫరా కారణంగా కష్టాలు ఎక్కువయ్యాయి. హర్యానా విడుదల చేస్తున్న నీటి గురించి తెలియజేయడానికి, అత్యవసర సమావేశానికి గౌరవనీయులైన లెఫ్టినెంట్ గవర్నర్‌ సమయం కోరినట్లు మంత్రి అతిషి తెలిపారు. 7 నీటి శుద్ధి కేంద్రాలు మునక్‌ కెనాల్‌ నుంచి వచ్చే నీటి పైనే ఆధారపడి ఉన్నాయి. నీటి పరిమాణం పెరగకపోతే, ఢిల్లీ అంతటా నీటి పరిస్థితి 1-2 రోజుల్లో మరింత దిగజారుతుందని ఆమె పోస్ట్‌లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్‌ జోక్యం చేసుకొని పరిస్థితిని పరిష్కరించవలసిందిగా ఆయనను అభ్యర్థిస్తానని ఆమె చెప్పారు.


Similar News