యెమెన్ తీరంలో మునిగిన వలసదారుల పడవ.. 49 మంది మృతి

యెమెన్‌కు దక్షిణ తీరంలో సోమవారం ఘటన చోటు చేసుకుంది.

Update: 2024-06-11 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యెమెన్ తీరంలో వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ పడవ మునిగి 49 మంది మరణించినట్టు, మరో 140 మంది గల్లంతు అయినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసదారుల సంస్థ(ఐఓఎం) మంగళవారం ప్రకటనలో తెలిపింది. మునిగిన పడవ సోమాలియాలోని ఉత్తర తీరం నుంచి 260 మంది సోమాలీస్, ఇథియోపియన్‌లతో ప్రయాణించింది. యెమెన్‌కు దక్షిణ తీరంలో సోమవారం ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఇంకా గల్లంతైన వారిని వెతికే ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటివరకు 71 మందిని రక్షించినట్టు ఐఓఎం వెల్లడించింది. మృతుల్లో 31 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలని భావించే తూర్పు ఆఫ్రికా, హార్న్ ఆఫ్ ఆఫ్రికాకు చెందిన వారికి యెమెన్ ప్రధాన మార్గం. యెమెన్‌లో దాదాపు దశాబ్దాల కాలంగా అంతర్యుద్ధం ఉన్నప్పటికీ 2021 నుంచి 2023 మధ్య ఏటా వచ్చే వలసదారుల సంఖ్య మూడు రెట్లు పెరిగి, 27,000 నుంచి 29,000కి పెరిగిందని ఐఓఎం గత నెల పేర్కొంది. సంస్థ వివరాల ప్రకారం,.. ప్రస్తుతం 3,80,000 మంది వలసదారులు యెమెన్‌లో ఉన్నారు. అయితే, యెమెన్ చేరుకునేందుకు వలసదారులను స్మగ్లర్లు ఎర్ర సముద్రం లేదా ఏడెన్ గల్ఫ్ మీదుగా ప్రమాదకర పరిస్థితిల్లో తరలిస్తుంటారు. అనేక సందర్భాల్లో పడవలో ఎక్కువ రద్దీ ఉన్నప్పటికీ వారు అలాగే తీసుకెళ్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సైతం జిబౌటీ తీరంలో యెమెన్‌కు చేరేందుకు ప్రయత్నించిన రెండు ఓడల ప్రమాదాల్లో కనీసం 62 మంది మరణించారు. ఈ మార్గంలో ఇప్పటివరకు కనీసం 1,860 మంది మరణించడం లేదా అదృశ్యం కావడం జరిగింది. వారిలో 480 మంది మునిగిపోయారని ఐఓఎం స్పష్టం చేసింది. తాజా ఘటన అత్యవసరంగా వలసలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడం, వలసదారుల భద్రత కోసం పనిచేయవలసిన అవసరాన్ని సూచిస్తుందని ఐఓఎం ప్రతినిధి మహమ్మద్ అలీ అబునాజెలా అన్నారు. 


Similar News