రూ. 2,500 కోట్ల విలువైన 'మ్యావ్ మ్యావ్' పట్టుకున్న పోలీసులు

పూణేలో 700 కిలోల మెఫెడ్రోన్‌ను, ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలోని గోడౌన్‌ల నుంచి మరో 400 కిలోల డ్రగ్‌ స్వాధీనం

Update: 2024-02-21 15:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ, పూణెలలో రెండు రోజుల పాటు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో పోలీసులు 1,100 కిలోల నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా 'మ్యావ్ మ్యావ్'గా పిలువబడే ఈ డ్రగ్ విలువ రూ. 2,500 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణేలో ముగ్గురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 700 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆపరేషన్ ప్రారంభమైంది. వారిని విచారించిన అనంతరం ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలోని గోడౌన్‌ల నుంచి మరో 400 కిలోల డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో భారీ మొత్తం మెఫెడ్రోన్ సరుకు పూణేలోని కుర్‌కుంభ్ ఎంఐడీసీ ప్రాంతంలో నిల్వ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

మహారాష్ట్రలో ఈ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా దేశంలోనే అత్యంత ముఖ్యమైన డ్రగ్స్ స్వాధీనంలో ఇది ఒకటని అధికారులు చెబుతున్నారు. కుర్‌కుంభ్ ఎంఐడీసీ యూనిట్ల నుంచి న్యూఢిల్లీలోని నిల్వ కేంద్రాలకు నిషిద్ధ వస్తువులు రవాణా అవుతున్నట్లు ప్రాథమిక పరిశోధనలో తేలింది. ఈ ఘటన గురించి మాట్లాడిన పూణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్, 'ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. వారిలో ముగ్గురు కొరియర్ బాయ్స్‌తో పాటు మరో ఇద్దరు ప్రస్తుతం విచారణలో ఉన్నట్టు' పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వ్యాపారంలో సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు.

అరెస్టయిన వ్యక్తులకు, కరుడుగట్టిన డ్రగ్ ట్రాఫికర్ లలిత్ పాటిల్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పాటిల్ ప్రమేయం ఏ మేరకు ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పూణె బృందం ఢిల్లీ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో అక్కడ కూడా దాడులు నిర్వహించినట్టు అమితేష్ కుమార్ చెప్పారు. ఈ దాడుల్లో కొందరు విదేశీయులు, విదేశాల్లోని భారతీయులకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. 

Tags:    

Similar News