తమిళనాడులోని ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

తమిళనాడులోని ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది.

Update: 2024-09-28 06:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులోని ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మరో భారీ పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లాలో సాతూర్‌ వద్ద బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు కార్మికులు శిధిలాల కింద చిక్కుకున్నారు. ప్రాణ నష్టంపై వివరాలు వెల్లడి కాలేదు. పేలుడు ధాటికి ఐదు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఫ్యాక్టరీ‌లో ఉన్న కార్మికులను రక్షించడానికి ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో భారీ ఎత్తున బాణసంచా నిల్వలు, తయారీ సామాగ్రి ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది మే నెలలో కూడా ఇదే జిల్లాలో బాణ సంచా ఫ్యాకర్టీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. గత ఏడాది శివకాశీ తాలూకా..రెంగపాలయం గ్రామంలో కనిష్కర్‌ ఫైర్‌ వర్క్స్‌ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.

తమిళనాడు లోని శివకాశి, సహా మూడు, నాలుగు జిల్లాల్లో బాణసంచా కంపెనీలు ఉన్నాయి. అక్కడ పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు భారీ ఎత్తున వస్తుంటారు. దీపావళితోపాటు మిగతా పండుగల కోసం బాణాసంచా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున సరఫరా అవుతుంటుంది. బాణసంచా తయారీ కార్మికులకు తగిన నైపుణ్యం లేకపోవడంతో తరచూ ఈ కంపనీల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతీ ఏటా పదుల సంఖ్యలో కార్మికులు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు, తనిఖీలు చేపట్టిన ఇలాంటి దుర్ఘటనలు ఆగడం లేదు. 


Similar News