Manusmriti: డీయూ సిలబస్‌లో మనుస్మృతి టాపిక్ తొలగింపు.. ఫ్యాకల్టీ వ్యతిరేకించడంతో ప్రతిపాదన వెనక్కి

ఢిల్లీ యూనివర్సిటీ సిలబస్‌లో మనుస్మృతి, బాబర్‌నామా టాపిక్ లను చేర్చడంపై వివాదం నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2025-03-04 13:27 GMT
Manusmriti: డీయూ సిలబస్‌లో మనుస్మృతి టాపిక్ తొలగింపు.. ఫ్యాకల్టీ వ్యతిరేకించడంతో ప్రతిపాదన వెనక్కి
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ యూనివర్సిటీ (DU) హిస్టరీ (Histry) ఆనర్స్ సిలబస్‌లో మనుస్మృతి (Manusmriti), బాబర్‌నామా (Babur nama) టాపిక్ లను చేర్చడంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిని సిలబస్‌లో చేర్చాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ యోగేష్ సింగ్ (Yogesh singh) దీనిని ధ్రువీకరించారు. విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల్లో అలాంటి అంశాలను ప్రవేశపెట్టే ప్రణాళికలు లేవని తెలిపారు. సామాజిక విభజనను ప్రోత్సహించే ఏ విషయాన్ని కూడా సిలబస్‌లో చేర్చబోమని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన ఆమోదం కోసం అకడమిక్ కౌన్సిల్ (AC) వద్దకు చేరకుండా తన అత్యవసర అధికారాలను ఉపయోగిస్తానని వెల్లడించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) అమలు చేయడానికి తాము కృషి చేస్తున్నామన్నారు. డీయూ విద్యార్థులు 21వ శతాబ్ధం నాటి విషయాలను అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

కాగా, గత నెల 19న ఢిల్లీ యూనివర్సిటీ చరిత్ర సిలబస్‌లో మనుస్మృతి, బాబర్ ఆత్మకథ అయిన బాబర్ నామాలను చేర్చాలనే ప్రతిపాదనకు జాయింట్ కరికులం కమిటీ ఆమోదం తెలిపింది. అయితే దీనిని ఇంకా అకడమిక్ కౌన్సిల్‌ (Acadenic counsil) కు పంపించలేదు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సైతం ఆమోదించలేదు. అయితే ఈ ప్రతిపాదనను హిస్టరీ ఫ్యాకల్టీలో కొందరు సమర్థించగా, మరి కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. మనుస్మృతి కుల ఆధారిత వివక్ష, అణచివేతను ప్రోత్సహిస్తుందని దీనిని సిలబస్‌లో చేర్చడం భారత రాజ్యాంగానికి, సమాజ ప్రగతిశీల సూత్రాలకు విరుద్దమని ఆరోపించారు. అంతేగాక బాబర్ చరిత్ర విధ్వంసాలతో కూడుకుని ఉందని తెలిపారు. దీంతో ఈ వివాదం నేపథ్యంలో యూనివర్సిటీ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది.

Tags:    

Similar News