మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానానికి తెర

దిశ, నేషనల్ బ్యూరో : ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌‌ సహా 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం బుధవారంతో ముగిసింది.

Update: 2024-04-03 16:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌‌ సహా 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం బుధవారంతో ముగిసింది. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వీరిలో కొందరు మళ్లీ పెద్దల సభలోకి అడుగుపెట్టనుండగా.. 91 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌‌ సహా చాలా మంది మాత్రం దూరంగా ఉండనున్నారు. ఏప్రిల్ 3తో పార్లమెంటులో మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ఈ సందర్భంగా యావత్ దేశం ఆయన సేవలను గుర్తు చేసుకుంది. గతంలోకి వెళితే.. మన్మోహన్‌ సింగ్‌ తొలిసారిగా 1991 అక్టోబరులో పెద్దల సభలోకి ఎంటరయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా ఆయన నిలిచారు. ఇంతకుముందు రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు మన్మోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికవగా.. ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి సోనియాగాంధీ తొలిసారిగా పెద్దల సభలోకి అడుగు పెడుతున్నారు.

ఈ కేంద్ర మంత్రులు..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, పశుసంవర్ధక, మత్య్స శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, సహాయ మంత్రి మురళీధరన్‌, నారాయణ్‌ రాణె, ఎల్‌ మురుగన్‌ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌ 2తో ముగిసింది. పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ల పదవీకాలం ఏప్రిల్‌ 3తో ముగుస్తుంది. వీరిలో అశ్వనీ వైష్ణవ్‌ మినహా మిగతా వారంతా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. వైష్ణవ్‌, మురుగన్‌లకు మాత్రమే రాజ్యసభకు వెళ్లే అవకాశం మరోసారి దక్కింది.

Tags:    

Similar News