మనీశ్ సిసోడియాకు కేంద్ర హోంశాఖ షాక్!

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఉచ్చు బిగుస్తోంది.

Update: 2023-02-22 06:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఉచ్చు బిగుస్తోంది. స్నూపింగ్ ఆరోపణలపై మనీశ్‌ సిసోడియాకు కేంద్ర హోం శాఖ షాకిచ్చింది. ఫీడ్‌బాక్‌ యూనిట్‌ స్నూపింగ్ కేసులో ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. అయితే, 2015లో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ శాఖల్లో అక్రమాలను తనిఖీ చేయడానికి ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ను(ఎఫ్‌బీయూ) నియమించి రాజకీయంగా వాడుకొని దుర్వినియోగం చేసిందని సీబీఐ ఆరోపించింది.

ఇందులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పాత్ర అధికంగా ఉందని.. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని లెఫ్టినెంట్‌ గవర్నర్ వీకే సక్సేనాను సీబీఐ కోరగా.. ఆయన ఇప్పటికే అంగీకారం తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ అనుమతి కోసం పంపారు. ఈ విజ్ఞప్తికి హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది.

అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 17 ప్రకారం సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి మంజూరు చేయబడిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపిన కమ్యూనికేషన్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా ఇప్పుడు స్నూపింగ్ కేసులో కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా, తాజా వార్తలపై మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రత్యర్థులపై కేసులు బనాయించడం బలహీన, పిరికి మనస్తత్వానికి నిదర్శనం అని అన్నారు. ఆప్‌ ఎదుగుతున్న కొద్దీ.. ఇలాంటి కేసులు మరిన్ని వస్తూనే ఉంటాయని ట్వీట్ చేశారు. మరోవైపు, కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడినప్పటికీ, అదానీ గ్రూప్‌పై ఎలాంటి విచారణ జరగడంలేదని ఆప్‌ నేతలు విరుచుకుపడ్డారు.

Tags:    

Similar News