Manipur violence: మణిపూర్‌లో మరో అరాచకం..

మణిపూర్‌లో మే నెలలో జరిగిన మరో అరాచకం వెలుగులోకి వచ్చింది.

Update: 2023-07-23 12:10 GMT

ఇంఫాల్ : మణిపూర్‌లో మే నెలలో జరిగిన మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్‌.చురాచాంద్‌ సింగ్‌ భార్య 80 ఏళ్ళ సోరోకైబామ్‌ ఇబెటోంబిని అల్లరి మూక సజీవ దహనం చేసింది. మే 28న తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇబెటోంబి అస్థికలు ఇప్పటికీ కాలి బూడిదైన ఆ ఇంట్లోనే పడి ఉన్నాయని పేర్కొన్నాయి. ఇబెటోంబి ఇంట్లో ఉండగా.. సాయుధ దుండగులు ఆ ఇంటికి బయట నుంచి గడియ పెట్టారు.

అనంతరం ఆ ఇంటికి నిప్పుపెట్టారు. ఆమెను రక్షించేందుకు కుటుంబీకులు అక్కడికి చేరుకొనేసరికే.. ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈ విషయాన్ని ఇబెటోంబి మనవడు ప్రేమ్‌కాంత వెల్లడించాడు. ‘‘మాపై అల్లరి మూక కాల్పులు జరపడాన్ని గమనించిన మా మామ్మ.. మమ్మల్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరింది. అయితే ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయింది’’ అని అతడు గుర్తుకు తెచ్చుకున్నాడు. చురచాంద్‌ సింగ్‌.. గతంలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలామ్‌ నుంచి సత్కారం అందుకొన్నారు.


Similar News