Manipur violence: మణిపూర్‌లో మరోసారి హింస..ఇళ్లను తగులబెట్టిన దుండగులు

మైతీ, హ్మార్ కమ్యూనిటీల ప్రతినిధుల మధ్య శాంతి ఒప్పందం జరిగిన 24 గంటల్లోనే మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్‌లోని లాల్పాని గ్రామంలో మిలిటెంట్లు అనేక సార్లు కాల్పులకు తెగపడటంతో పాటు, పలు ఇళ్లకు నిప్పుపెట్టారు.

Update: 2024-08-03 13:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మైతీ, హ్మార్ కమ్యూనిటీల ప్రతినిధుల మధ్య శాంతి ఒప్పందం జరిగిన 24 గంటల్లోనే మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్‌లోని లాల్పాని గ్రామంలో మిలిటెంట్లు అనేక సార్లు కాల్పులకు తెగపడటంతో పాటు, పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. అయితే ఆ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లాల్పానీలో మైతీ వర్గానికి చెందిన వ్యక్తుల ఇళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలో హింస చెలరేగడంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపుచర్యలు చేపట్టారు.

కాగా, అసోంలోని కాచర్‌కు సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో మైతీ, హ్మార్ కమ్యూనిటీల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇరు సంస్థలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. జిల్లాలో పరిస్థితిని సాధారణీకరించడంతో పాలు హింసాత్మక ఘటనలను అరికట్టాలని ఇరు సంఘాలు నిర్ణయించుకున్నాయి. భద్రతా బలగాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. తదుపరి భేటీ ఆగస్టు 15న చేపట్టనున్నట్టు తెలిపాయి. ఈ సమావేశానికి జిరిబామ్ జిల్లా యంత్రాంగం, అస్సాం రైఫిల్స్, సీఆర్‌ఫీఎఫ్ మధ్యవర్తిత్వం వహించాయి. జిల్లాకు చెందిన పలు సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఒప్పందం జరిగిన 24గంటల్లోనే హింస చోటుచేసుకోవడం గమనార్హం.

Tags:    

Similar News