ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిన 400 మంది అల్లరి మూకలు
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా తగ్గడం లేదు.
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా తగ్గడం లేదు. హింసాకాండతో చుట్టుముట్టిన భయాలు ప్రజలను వీడటం లేదు. తాజాగా గురువారం సాయంత్రం చురాచంద్‌పూర్ ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు దాదాపు 400 మంది అల్లరి మూకలు యత్నించారు. ఈక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా భద్రతా బలగాలు రంగంలోకి దిగి టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి. ఈ వ్యవహారంలో చురాచంద్‌పూర్ జిల్లా పోలీసు విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సియామ్‌లాల్‌పాల్‌పై డిపార్ట్‌మెంటల్ విచారణ జరుగుతోంది. ఇతగాడు ఫిబ్రవరి 14న సాయుధ వ్యక్తులతో కలిసి దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ముందస్తు అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్‌ను విడిచి వెళ్లొద్దని ఉన్నతాధికారులు సియామ్ లాల్‌పాల్‌కు ఆదేశాలిచ్చారు. అతడి వేతనం, అలవెన్సులను కూడా ఆపేయాలని తాత్కాలిక ఆర్డర్ ఇచ్చారు. అంతకుముందు గురువారం ఉదయం మణిపూర్‌లోని ఇంఫాల్ లోయలో ఉన్న ఐదు జిల్లాల పరిధిలో వేలాది మంది మహిళలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొండల సమీపంలోని గ్రామాలను లక్ష్యంగా చేసుకుని సాయుధ పురుషులు తరచుగా తుపాకీ దాడులు చేస్తున్నారని వారు ఆరోపించారు.